
దసరా సంబరం.. ఆరంభం
● వైభవంగా ప్రారంభమైన
దసరా ఉత్సవాలు
● ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన
హర్యాణా అఘోరాల భంభంభోలే,
భోపాల్ శివశక్తి డ్రమ్స్
ప్రొద్దుటూరు కల్చరల్ : పుత్తడిపురం ప్రొద్దుటూరులో దసరా ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కలశాలతో గ్రామో త్సవం నిర్వహించారు. 102 మంది ఆర్యవైశ్య సుహాసినులు అగస్త్యేశ్వర స్వామి ఆలయం నుంచి కలశాలలో నింపిన నవగంగ తీర్థాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం కన్యకాపరమేశ్వరిదేవి ఆలయం నుంచి మంగళవాయిద్యాలతో, బాణసంచా పేలుళ్లతో ఊరేగింపుగా బయల్దేరి తెల్లాకుల శివయ్యగారి నగరేశ్వరస్వామి దేవస్థానం నుంచి శ్రీకన్యకాపరమేశ్వరిదేవి పురాణాన్ని తీసుకురావడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో హర్యాణా కళాకారుల అఘోరాల భంభంభోలే, భోపాల్ శివశక్తి డ్రమ్స్, శ్రీ కోదండరామ కోలాటబృందం వారి కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా బందోబస్తు నిర్వహించారు.
● శ్రీ మహాలక్ష్మి సమేత చెన్నకేశవస్వామి ఆలయ దసరా ఉత్సవ కమిటీ వారు ఊరేగింపుగా పాత బస్టాండ్ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద పూజలు చేసి కలశాన్ని తీసుకెళ్లారు. కోలాట నృత్యం, బ్యాండుమేళం ఆకట్టుకుంది.
● స్థానిక శివాలయం రాజరాజేశ్వరి ఉత్సవ కమిటీ వారు దసరా ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా కలశాలను ఊరేగింపుగా తీసుకెళ్లి రాజీవ్ సర్కిల్‌లోని శివాలయంలో పూజలు చేశారు.
● రతనాల వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి 250 మందిపైగా సుహాసినులు అగస్త్యేశ్వరాలయానికి చేరుకుని గంగాజలంతో నింపిన కలశాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లారు.
● శాసీ్త్రనగర్‌లోని రాజరాజేశ్వరిదేవి ఆలయం, చౌడేశ్వరీదేవి, పెద్దమ్మతల్లి ఆలయం, ముక్తిరామలింగేశ్వరాలయం తదితర ఆలయాల నిర్వాహకులు కలశపూజను వైభవంగా నిర్వహించారు. కళాకారుల ప్రదర్శనలు, డప్పువాయిద్యాల ప్రదర్శనలు అలరించాయి.
● కడప అమ్మవారిశాలతో పాటు విజయదుర్గా ఆలయంలోనూ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
కడప విజయదుర్గాలయంలో అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు
కడప అమ్మవారిశాలలో దీక్షాబంధన దేవీ అలంకారం

దసరా సంబరం.. ఆరంభం

దసరా సంబరం.. ఆరంభం

దసరా సంబరం.. ఆరంభం