
బాబు బినామీల కోసమే ప్రైవేటీకరణ
● ఐక్య పోరాటాలతో ప్రజా వ్యతిరేక విధానాలను అడ్డుకుందాం
● రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష,ప్రజా సంఘాల నేతలు
కడప రూరల్: వైద్య విద్యను పరిరక్షించాల్సిన పాలకులే భక్షకులుగా మారారని నేతలు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన బినామీల కోసమే వైద్య విద్యను కార్పొరేట్ సంస్ధలకు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్‌లో ‘మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎవరికోసం’ అనే అంశంపై మేధావులు, అఖిలపక్ష, ప్రజా సంఘాల నేతల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరామ్ యాదవ్ మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ.. మెడికల్ కాలేజీల ఏర్పాటుకు చర్యలు చేపట్టారని అన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజా వ్యతిరేక విధా నాలను అవలంబిస్తూ ప్రజల్లో అలజడి సృష్టించా రని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవే ట్ పరం చేస్తూ నిర్ణయించడం దారుణమని పేర్కొ న్నారు. బాబు తన బినామీలకోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఓజీ సినిమాపై ఉన్న శ్రద్ధ ప్రజా ఆరోగ్యంపై లేదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ విధానం వలన ప్రతిభావంతులైన పేద విద్యార్ధులకు తీవ్ర అన్యా యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి శివ యా దవ్ , న్యాయవాది సంపత్‌కుమార్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు మాట్లాడుతూ ప్రైవేటీకరణ ప్రజా వ్యతిరేక నిర్ణయమని తెలిపారు. సీఐటీయూ నాయకులు కామనూరు శ్రీనివాసులు మాట్లాడుతూ పులివెందుల మెడికల్ కాలేజీకి మంజూరైన సీట్లను కూటమి ప్రభుత్వం తిరస్కరించిన రోజే పెద్ద ఎత్తున వ్యతిరేకించి, ఉద్యమాలు చేపట్టిఉంటే, నేడు ప్రైవేటీకరణ ఉండేది కాదన్నారు. న్యాయవాదుల సంఘం జిల్లా అధ్యక్షులు జీవీ రాఘవరెడ్డి మాట్లాడుతూ ఏ రంగన్నైనా సరే ప్రైవేటీకరణ చేయడం మంచిది కాదన్నారు. జన చైతన్య సమగ్రాభి సంస్ధ అధ్యక్షులు గోపాల్, పౌర హక్కుల సంఘం నేత వెంకటేష్ , బీసీ, ఎస్సీ సంఘాల నేతలు అవ్వారు మల్లిఖార్జున, జేవీ రమణ, సంగటి మనోహర్ మాట్లాడుతూ ఐక్యంగా ప్రైవేటీకరణను అడ్డుకుందామని పిలుపునిచ్చారు. డాక్టర్ శ్రీనివాసులు, శ్రీక్రిష్ణ, భాస్కర్ పాల్గొన్నారు.