
కడప గడపలో టీఢీపీ!
పార్టీ జెండా మోసినోళ్లకే అండ దొరకడం లేదా..! పార్టీ గెలుపు కోసం పని చేస్తే .. అట్నుంచి కనీస పిలుపు కూడా దక్కడం లేదా! ... అంటే అవుననే అంటున్నాయి టీడీపీ శ్రేణులు. పశ్చా‘త్తాపం’తో రగిలిపోతున్న పచ్చ నేతలు అసమ్మతి స్వరం పెంచారు. కడప ఎమ్మెల్యే తీరుపై తిరుగుబావుటా ఎగురువేశారు. ఏకంగా పశ్చాత్తాప యాత్రకు సిద్ధమయ్యారు.
సాక్షి ప్రతినిధి, కడప: కడప తెలుగుదేశం పార్టీలో అసమ్మతి జ్వాల రగులుతోంది. ముఖ్యంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సీనియర్లను విస్మరించి వలస నేతలకు ప్రాధాన్యత ఇవ్వడంపై సీని యర్లలో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం దేవుని కడపలో సీనియర్ నేతలు పశ్చాత్తాప యాత్ర చేపట్టనున్నారు. టీడీపీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచే నాయకున్ని చూపాలంటూ స్వామికి విన్నవించనున్నారు.
● కడప నియోజకవర్గంలో టీడీపీ విజయబావుటా కోసం పార్టీ నేతలు అనేక మంది శక్తికి మించి కృషి చేశారు. ఎన్నికల తర్వాత వారంతా పల్లకి మోసే బోయీలుగా మిగిలారు. మాధవిరెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేపట్టకముందు ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి, ఎస్ గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్, అమీర్‌బాబు టీడీపీకి పెద్ద దిక్కుగా నిలిచారు. ఏ క్షణం మాధవిరెడ్డి నియోజకవర్గ బాధ్యతలు చేపట్టారో.. అప్పటి నుంచి క్రమేపీ సీనియర్లు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. పాతకడప మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాంప్రసాద్‌రెడ్డిలు కడపలో మాధవి రెడ్డి పరిచయ కార్యక్రమం, బలపర్చడం వెనుక కీలక భూమిక పోషించారు. ఎన్నికల్లో మాధవిరెడ్డి విజయం సాధించిన తర్వాత టీడీపీ క్రియాశీలక నేతల ప్రాధాన్యత, పరపతి పూర్తిగా తగ్గిపోయింది. అంతేకాదు టీడీపీలో చేరిన 8మంది వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే కార్యాలయంలో వలస నేతలే కీలకమయ్యారు. ఈక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయంలోనే ప్రత్యక్షంగా పరస్పర దాడులకు తెగబడ్డారు. నగర అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డిపై హత్యాయత్నం చోటు చేసుకుంది. మరోవైపు ఎమ్మెల్యే టికెట్ ఆశించిన ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్, అమీర్‌బాబు లాంటి వారంతా తెరమరుగు కావాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఈ పరిస్థితుల్లో పేరుకుపోయిన అసంతృప్తి తీవ్రస్థాయికి చేరింది. ఏకంగా దేవుని కడపలో పశ్చాత్తాప యాత్ర చేపట్టే స్థాయికి వెళ్లింది.
ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఏకపక్ష చర్యలపై పాతకడప మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి తిరుగుబాటు జెండా ఎగురవేశారు. దేవునికడప, పాతకడప ప్రాంతానికి చెందిన టీడీపీ నేతలు కార్యకర్తలతో సోమవారం పశ్చాత్తాప యాత్ర చేపట్టనున్నారు. కడప ఎమ్మెల్యేగా మాధవి రెడ్డి విజయం కోసం కృషి చేసినందుకు పశ్చాత్తాపం పడుతున్నాం.. అంటూ యాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఆపై నగరంలో టీడీపీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా నిలిచే నాయకుడి కోసం శ్రీవేంకటేశ్వరస్వామిని అభ్యర్థించనున్నారు. అనంతరం మూకుమ్మడిగా వెళ్లి కమలాపురం టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డిని కలవనున్నట్లు సమాచారం. అండగా రక్షణగా నిలవాలంటూనే టీడీపీ సీనియర్లను కాపాడుకునేందుకు కడపపై దృష్టి పెట్టాలని అభ్యర్థించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే నగర టీడీపీ కమిటీ నియామకంపై అనేక మంది గరంగరంగా ఉన్నప్పటికీ బాహాటంగా వ్యాఖ్యనించడం లేదు. కొండా సుబ్బయ్య లాంటి వారు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కమారుగా సెగలు కక్కుతూ తెరపైకి రావడం విశేషం.
ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించిన నేతల తిరుగుబాటు
ఎమ్మెల్యే మాధవి ఎంపికపై నేడు నేతల పశ్చాత్తాప యాత్ర
పాత కడప మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో నిర్వహణ
కలిసి అడుగులు వేస్తున్నటీడీపీ సీనియర్ కార్యకర్తలు