
తక్కువ బరువు ఉన్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ
కడప కోటిరెడ్డి సర్కిల్ : అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే తక్కువ బరువు ఉన్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐసీడీఎస్ పీడీ పి.రమాదేవి, టాటా ట్రస్ట్ డాక్టర్ వీరభద్రుడు, అమరావతి, వరలక్ష్మి తెలిపారు. కడప నగరంలోని మానస ఇన్ హోటల్‌లో జిల్లా స్థాయి సీడీపీఓ, సూపర్‌వైజర్లకు కమ్యూనిటీ బేస్డ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ అక్యూట్‌మాల్ న్యూట్రీషియన్‌పై శుక్రవారం శిక్షణ ఇచ్చారు. వారు మాట్లాడుతూ 0–5 ఏళ్లలోపు పిల్లల్లో పోషకాహార లోపం ఉన్న వారిని గుర్తించి ఆరోగ్య చికిత్స అందించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు ఎత్తు, బరువు తీసి తీవ్ర లోప పోషణ, అతి తీవ్ర లోప పోషణ పిల్లలను గుర్తించాలన్నారు. వారికి అదనంగా బాలామృతం 2.5 కేజీలు ఇవ్వాలన్నారు. తల్లులకు బిడ్డ స్థితి గురించి తెలియజేసి పర్యవేక్షించాలన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు, చాపాడు, జమ్మలమడుగు, కడప, కమలాపురం, ముద్దనూరు ప్రాజెక్టుల సీడీపీఓలు, సూపర్‌వైజర్లు హాజరయ్యారు.