
సీమపై వివక్ష.. ఉద్యమమే రక్ష
అన్నీ అమరావతికి తరలింపు
కడప సెవెన్‌రోడ్స్: రాయలసీమపై కూటమి ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోంది. తమ హక్కులు సాధించుకునేందుకు ఈ ప్రాంత వాసులకు పోరాటమే శరణ్యమని ఉద్యమ నేతలు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు శనివారం ఉదయం 10.00 గంటలకు కోవెలకుంట్లలోని పేరా ఫంక్షన్ హాలులో సమావేశం నిర్వహించనున్నారు. కుందూ పోరాట సమితి నాయకులు కామని వేణుగోపాల్‌రెడ్డి ప్రథమ వర్ధంతి సభ సందర్భంగా కుందూ పరిరక్షణ సమితి, కుందూ పోరాట సమితి, కోవెలకుంట్ల ప్రజా సంఘాల ఐక్యవేదిక సంయుక్తాధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉద్యమ నేత కరీంబాషా తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమ ప్రాంత అభివృద్ధి పట్ల వివక్ష ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా రాయలసీమ శాశ్వత కరువు నివారణకు ఉద్దేశించిన సాగునీటి ప్రాజెక్టులను విస్మరిస్తోంది. వీటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయించకపోవడంతో భవిష్యత్తు అంధకారంగా మారింది. ఎటువంటి అభ్యంతరాలు లేకపోయినా, గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లించి శ్రీశైలంలో.. ఆ మేరకు ఆదా అయిన నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేసీ కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ కోసం 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కోవెలకుంట్ల సమీపంలోని జొలదరాశి, పెద్దముడియం మండలంలోని రాజోలు రిజర్వాయర్లకు శంకుస్థాపన చేశారు. 17 ఏళ్లు గడిచినా ఇంతవరకు నిర్మాణం ఊసే లేదు. జమ్మలమడుగు నియోజకవర్గంలో భూ సేకరణ పేరుతో రైతుల భూములను ప్రభుత్వం సేకరించింది గానీ ఇప్పటి వరకు పరిహారం చెల్లించలేదు. దీంతో భూములను అమ్ముకోవడానికి కూడా తమకు హక్కు లేకుండా పోయిందని కుందూ పరీవాహక ప్రాంత గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి గోదావరి జలాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఆ దిశగా ఎత్తిపోతల పథక నిర్మాణ పనులు కూడా జరిగాయి. చంద్రబాబు అండ్‌కో కుతంత్రాలతో ఆ పథకం అర్ధాంతరంగా ఆగింది. గాలేరు–నగరి వరద కాలువ సామర్థ్యాన్ని 30 వేల క్యూసెక్కులకు పెంపు చేసే పనులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. కర్నూలు జిల్లాలోని పెట్నికోట వద్ద 20 టీఎంసీలు, కడప జిల్లా ముద్దనూరు మండలం దేనేపల్లె వద్ద 20 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందువల్ల కృష్ణానది వరద సమయాల్లో వీలైన మేరకు నీటిని నిల్వ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. దేనేపల్లె రిజర్వాయర్ నుంచి చక్రాయపేట మండలంలోని కాలేటివాగుకు నీరు తీసుకు రావాలని భావించారు. కాలేటివాగు నిర్మాణ పనులు కూడా దాదాపు 80 శాతం వైఎస్సార్‌సీపీ సర్కారు హయాంలోనే జరిగాయి. అక్కడి నుంచి కృష్ణా జలాలు వెలిగల్లు రిజర్వాయర్‌కు తరలించి హంద్రీ–నీవాతో అనుసంధానం చేసి మదనపల్లె, పుంగనూరు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలనేది ఆ పథక ఉద్దేశం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని నిర్వీర్యంగా మార్చారు. బనకచర్ల నుంచి గాలేరు–నగరి వరద నీటి కాలువ నిర్మాణ పనులు ఆగిపోయాయి. వైఎస్‌ఆర్ హయాంలో పూర్తయిన వామికొండ, సర్వరాయసాగర్, బ్రహ్మంసాగర్ ఆయకట్టు కింద సాగునీటిని అందించేందుకు డిస్ట్రిబ్యూటరీలు, ఫీల్డ్ ఛానల్స్ పనులు కూడా.. చేపట్టకపోవడంతో ప్రాజెక్టుల భవిష్యత్తు అయోమయంగా మారింది.
విద్య, వైద్య సౌకర్యాలు దూరం
ఇకపోతే కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్ల పులివెందుల మెడికల్ కళాశాల 50 సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఇలా వ్యవహరించిన ప్రభుత్వం ఇప్పుడు పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇందువల్ల ముఖ్యంగా వెనుకబడ్డ రాయలసీమ ప్రాంత విద్యార్థులతోపాటు ప్రజలు విద్య, వైద్య సౌకర్యాలను కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
విశాఖ–చైన్నె పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ను అమరావతికి తరలించడం ద్వారా ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో తీసుకొచ్చిన పరిశ్రమలను ఇటీవల మంత్రి లోకేష్ ప్రారంభించి.. అవి తానే ఏర్పాటు చేయించుకున్నట్లుగా చెప్పుకోవడం పట్ల ప్రజలు విస్తుపోతున్నారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమం ద్వారా ఒత్తిడి తెస్తే తప్ప రాయలసీమకు న్యాయం జరగదన్న ఉద్దేశంతో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు శనివారం కోవెలకుంట్లలో నిర్వహిస్తున్న సమావేశానికి పాత, కొత్త తరానికి చెందిన ఉద్యమ నాయకులు తరలి రావాలని కరీంబాషా కోరారు.
రాయలసీమపై కూటమి శీతకన్ను
సాగునీటి ప్రాజెక్టులకు గ్రహణం
పరిశ్రమలు, వైద్య రంగంపై నిర్లక్ష్యం
ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం
నేడు కోవెలకుంట్లలో నేతల సమావేశం

సీమపై వివక్ష.. ఉద్యమమే రక్ష

సీమపై వివక్ష.. ఉద్యమమే రక్ష