సమ్మెకు.. నోటీసులు | - | Sakshi
Sakshi News home page

సమ్మెకు.. నోటీసులు

Sep 18 2025 11:07 AM | Updated on Sep 18 2025 11:07 AM

సమ్మెకు.. నోటీసులు

సమ్మెకు.. నోటీసులు

డిమాండ్లు ఇవీ...

కడప కార్పొరేషన్‌: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2022లో అక్టోబర్‌ 2 మహాత్మాగాంధీ జయంతి రోజు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. సరిగ్గా మూడేళ్ల తర్వాత కూటమి ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగులు ఒకరోజు ముందే అక్టోబర్‌ 1 నుంచి సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తమపై ప్రభుత్వం మోపుతున్న పనిభారం తగ్గించాలని, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని వారు కోరుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు జేఏసీగా ఏర్పడి అధికారులకు సమ్మె నోటీసులు ఇప్పటికే అందజేశారు. ఈనెల 22వ తేదీ నుంచి దశలవారీ ఆందోళనలు చేపట్టి అక్టోబర్‌ ఒకటి నుంచి నిరవధిక సమ్మెను చేపట్టాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌ కడప జిల్లాలోని 36 మండలాలు, ఒక మున్సిపల్‌ కార్పొరేషన్‌, 5 మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలలో 889 గ్రామ, వార్డు సచివాలయాలు నడుస్తుండగా, వాటిలో సుమారు 7600 మంది ఉద్యోగులు విధులను నిర్వర్తిస్తున్నారు.

వలంటీర్ల బాధ్యతలు

సచివాలయ ఉద్యోగులకే...

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేయడం, పింఛన్ల పంపిణీ, ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలు, కార్యక్రమాలను వలంటీర్లు అమలు చేసేవారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.10వేల జీతమిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 2024లో అధికారంలోకి వచ్చాక వలంటీర్లకు జీతాలు పెంచకపోగా వలంటీర్ల వ్యవస్థనే ఎత్తేసింది. కూటమి పాలనలో వలంటీర్లు లేకపోవడంతో ఆ పనులన్నీ చేసే బాధ్యత సచివాలయ ఉద్యోగులపైన పడింది. దీంతో సహజంగానే సచివాలయ ఉద్యోగులపై అధిక భారం, పని ఒత్తిడి పెరిగింది. ప్రజలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, విద్య, వైద్యం, ఆధార్‌, బయోమెట్రిక్‌ వివరాలు, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాల సేకరణలతో భారం అధికమైంది.

ఆందోళనకు కార్యాచరణ ప్రణాళిక

తమ సమస్యల పరిష్కారానికి జిల్లాలోని సచివాలయ ఉద్యోగ జేఏసీ సంఘ ప్రతినిధులు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేశారు. ఇప్పటికే మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలకు సమ్మె నోటీసులు అందజేశారు. సెప్టెంబర్‌ 30వ తేదిలోపు తమ డిమాండ్లు పరిష్కరించకపోతే అక్టోబర్‌ 1వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తామన్న సంకేతాలు ఇస్తున్నారు.

● ప్రతిసారీ సర్వేల పేరుతో ఇంటింటికీ తిరిగి విధులు నిర్వహించడం వల్ల క్షేత్రస్థాయిలో తీవ్ర అవమానాలకు గురవుతూ, ఆత్మ గౌరవం కోల్పోతున్నాం. వీటి నుంచి విముక్తి కల్పించాలి.

● విద్యార్హతల ఆధారంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధులు అప్పగించాలి.

● గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను మాతృశాఖలకు అప్పగించాలి.

● సమయపాలన లేని, ఒత్తిడితో కూడుకున్న విధుల నుంచి విముక్తి కల్పించాలి.

● సెలవులు, పండుగలు, ఆదివారాల్లో బలవంతపు విధులు చేయించడం ఆపాలి.

● ఆరేళ్లు ఒకే క్యాడర్‌లో సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఏఏఎస్‌ ప్రకారం స్పెషల్‌ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి.

● ప్రొబేషనరీ సమయంలో రావలసిన నోషనల్‌ ఇంక్రిమెంట్లకు స్పష్టమైన ప్రైమ్‌టైమ్‌ నిర్ణయించాలి.

● పట్టణ స్థానిక సంస్థల్లోని వార్డు సచివాలయాల్లోని ఖాళీలకు 50 శాతం సచివాలయ సిబ్బందితో భర్తీ చేయాలి.

● సర్వేలను ఆయాశాఖల సంబంధిత ఉద్యోగులతో నిర్వహించి, సచివాలయ సిబ్బందిపై భారం తగ్గించాలి.

● గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రస్తుతం అమలవుతున్న రికార్డు అసిస్టెంట్‌ క్యాడర్‌ను జూనియర్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌కు మార్పు చేయాలి.

● గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల స్టేషన్‌సీనియారిటీ ఆధారంగా పారదర్శక బదిలీలు జరిగేలా ప్రత్యేక విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయాలి.

అత్మగౌరవం దెబ్బతింటోంది

సచివాలయ ఉద్యోగులు ఏ విధులు నిర్వహించాలో వాటినే ప్రభుత్వం అప్పగించాలి. అసలు ప్రజల ఇళ్ల వద్దకు సర్వేలు చేయడం, తమకు సంబంధం లేని ఎరువుల విక్రయాల వద్ద విధులను అప్పగించడం మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. తమ విధులేమిటో ప్రభుత్వం నిర్ణయించి జాబ్‌చార్జ్‌ను ప్రకటించాలి. లేదంటే రాష్ట్ర జేఏసీ నిర్ణయం ప్రకారం ముందుకు వెళతాం. – హీరామియ్యా, జిల్లా అధ్యక్షుడు.

గ్రామ, వార్డు సచివాలయం ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌

వలంటీర్లు చేసే పనంతా మాపై పడింది

ఇదివరకు 50 ఇళ్లకు ఒక వలంటీరు ఉండేవారు. ఒక సచివాలయంలో 25 క్లస్లర్టు ఉంటాయి. వలంటీర్లు చేసే పనంతా మాపైనే పడుతోంది. డ్యూయల్‌ బాసిజం మాపై ఎక్కువైంది. అన్ని రకాల పనులు మాతోనే చేయిస్తున్నారు. ఇది చాలా దారుణం. అలాగే పదోన్నతులు కల్పించడానికి తగిన విధి విధానాలు రూపొందించాలి. – పి. సిద్దేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య సంక్షేమ సంఘం

చిన్నచూపు చూస్తున్నారు

కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ వ్యవస్థను నిర్వీ ర్యం చేస్తున్నారు. ఒక్క సమస్యకు పరిష్కారం లేదు. కనీస డిమాండ్లు తీర్చకపోగా తమను చిన్నచూపు చూస్తూ ఎగతాళి చేస్తున్నారు. సంబంధం లేని విధులు అప్పగించడమే కాక సర్వేల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులమైన మేము ఇంటింటికీ వెళ్లి ప్రజలు ఓటీపీలు చెప్పడం లేదు, వాటిని ఎలా పూర్తి చేయాలి. ఉద్యోగుల సంక్షేమం పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. తక్షణమే జాబ్‌చార్జ్‌ను ప్రకటించాలి. – ఎం. మస్తాన్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు,

గ్రామ, వార్డు, సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

ఈనెల 22 నుంచి సచివాలయ ఉద్యోగుల ఉద్యమబాట

డిమాండ్లు తీర్చాలని, పని భారం తగ్గించాలని డిమాండ్‌

జిల్లాలో 889 సచివాలయాలు, సుమారు 7600 మంది ఉద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement