
20న వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగ కార్యవర్గ సమావేశం
కడప కార్పొరేషన్: కడప నగరంలోని పాతరిమ్స్ ఆవరణలో ఉన్న బీసీ భవన్‌లో ఈనెల 20వ తేది ఉదయం 9 గంటలకు వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ సమావేశానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ సతీష్‌రెడ్డిలతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు. ఎన్నికల ముందు దళితులకు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోలేదన్నారు. ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎం. సుబ్బరాయుడు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరణ చేస్తే సీఎం, డిప్యూటీ సీఎంలు నోరు మెదపకపోవడం దారుణమన్నారు. ఈ సమస్యలన్నింటిపై సమావేశంలో చర్చించనున్నామన్నారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, నాయకులు బండి ప్రసాద్, రవి, అజయ్, శ్యామ్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
● రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్‌బాబుతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల రాక
● జయప్రదం చేయాలని జిల్లాఅధ్యఽక్షుడు ఎస్.వెంకటేశ్వర్లు పిలుపు