
ప్రతిభకు పట్టం.. విజ్ఞాన్ మంథన్
మదనపల్లె సిటీ : విద్యార్థుల్లో దాగిన ప్రతిభను, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణ వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పేరుతో జాతీయస్థాయిలో ప్రతిభాన్వేషణ్ పరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు, ప్రోత్సాహకాలు, దేశంలో సీఎస్‌ఐఆర్, ఐఎస్‌ఆర్‌వో, బార్క్, డీఆర్‌డీవో, ప్రముఖ జాతీయ ప్రయోగశాలలు, పరిశోధనా సంస్థలను చూసే అవకాశం, ఇంటర్న్‌షిప్, ఉపకారవేతనం పొందే అవకాశాన్ని కలిగిస్తోంది.
’కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో..
కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ ట్రైనింగ్, శాస్త్ర, సాంకేతిక విభాగం సంయుక్తంగా పరీక్ష నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులు ఆన్‌లైన్‌లో పరీక్ష పాల్గొనవచ్చు. ఆసక్తిగల విద్యార్థులు వీవీఎం అధికారిక వెబ్‌సైట్‌లో రూ.200 రుసుం చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలి.
వివిధ స్థాయిల్లో పరీక్ష
వివిధ స్థాయిల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, గణితం, సామాన్యశాస్త్రం, విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయ మేధావుల కృషి, సత్యేంద్రనాథ్, బోస్ జీవిత చరిత్ర, లాజికల్ థింకింగ్, రీజనింగ్ తదితర సబ్జెక్టుల్లో బహుళైచ్చిక విధానంలో ప్రశ్నలుంటాయి. వీవీఎం పరీక్ష సంబంధించి విద్యార్థులు మొదట పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇంటర్‌నెట్ ద్వారా పరీక్ష రాయవచ్చు. విద్యార్థి ఇంటి నుంచే ఆన్‌లైన్ విధానంలో, సెల్‌ఫోన్, ట్యాబ్, డెస్క్‌టాప్, ల్యాప్‌ట్యాప్‌ల ద్వారా పాల్గొనవచ్చు. ఆంగ్లం, హిందీతో పాటు 9 ప్రధాన ప్రాంతీయ భాషల్లో పరీక్షను నిర్వహిస్తారు. విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి నచ్చిన భాషలో పరీక్ష రాయవచ్చు. ప్రతిభ చూపిన విద్యార్జులకు స్థాయిని బట్టి ద్రువపత్రాలు,నగదు ప్రోత్సాహకాలు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు.
ప్రధానోపాధ్యాయుల కృషి అవసరం
విద్యార్థుల్లో సైన్స్‌పై ఆసక్తి కలిగించి నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు వీవీఎం పరీక్ష ఉపయోగపడుతుంది. ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలి.
– భాస్కరన్, డివిజన్ సైన్సు అధికారి, మదనపల్లె
విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు

ప్రతిభకు పట్టం.. విజ్ఞాన్ మంథన్

ప్రతిభకు పట్టం.. విజ్ఞాన్ మంథన్