
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమం
కడప అర్బన్: రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే.. ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు. కడప నగర శివారులో 2006లో 230 ఎకరాల్లో రిమ్స్‌ను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్థాపించారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 2019లో అధికారంలోకి రాగానే 125 కోట్ల రూపాయలతో 452 పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 40.81 కోట్ల వ్యయంతో 100 పడకల సామర్థ్యంతో మానసిక వైద్యశాల, 107 కోట్ల రూపాయల వ్యయంతో 100 పడకల కేన్సర్ హాస్పిటల్‌కు 2019 డిసెంబర్ 23న శంకుస్థాపన చేశారు. ఈ మూడు హాస్పిటల్స్ నిర్మాణాలను పూర్తి చేసి 2023 డిసెంబర్ 23న ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. అలాగే పులివెందులలో మెడికల్ కళాశాల, అనుబంధంగా ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ పాలనలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఈ నేపథ్యంలో కడప రిమ్స్‌ను వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా, కడప నగర మేయర్ కె.సురేష్‌బాబుతోపాటు వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం పరిశీలించారు. అనంతరం అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మీడియా బృందంతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన 16 నెలలకే మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారని, అలా చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ డాక్టర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ఆ పార్టీ నేతలు సులి సునీల్‌కుమార్, షేక్ షఫీ, కార్పొరేటర్లు పాకా సురేష్, బాలస్వామిరెడ్డితోపాటు పలువురు నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
విద్య, వైద్యం పేదలకు దూరం చేస్తే ఊరుకోం
కార్పొరేట్ వ్యక్తులకు కూటమి దోచిపెట్టే యత్నం
సూపర్ స్పెషాలిటీ వైద్యశాలకువైఎస్‌ఆర్ పేరు తొలగింపుపై ఆగ్రహం
రిమ్స్‌ను పరిశీలించినవైఎస్‌ఆర్‌సీపీ నేతలు