
మెడికల్ కళాశాలలపై చంద్రబాబు అబద్ధపు ప్రచారం
పులివెందుల : రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అనుచరులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ డాక్టర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి అన్నారు. పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలను వైఎస్సార్ వేషధారణలో శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ అనంతపురం సభలో చంద్రబాబు పాడేరు మెడికల్ కళాశాల మినహా, ఎక్కడ వైద్య కళాశాల నిర్మాణం జరగలేదని చెప్పడం దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యలను నివృత్తి చేసేందుకే అందరికీ వైద్య కళాశాల చూపుతానని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 12 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు గతంలో ఉండేవని, వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయిన తర్వాత 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారన్నారు. గతంలో రోగులను అత్యవసర పరిస్థితిలో రాష్ట్రంలో సరైన వసతులు లేక హైదరాబాద్, చైన్నె. బెంగుళూరు ప్రాంతాలకు అంబులెన్స్‌లలో తీసుకెళ్లడం జరిగిందన్నారు. సరిహద్దులలో అంబులెన్స్‌లు ఆపి రాష్ట్రంలో వైద్యం చేయించుకోవాలని చెప్పారన్నారు. దీంతోపాటు చాలామంది మెడికల్ కళాశాల బిల్లులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతుండేవారన్నారు. దీంతో అప్పటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారన్నారు. అందులో ఐఆదు మెడికల్ కళాశాలలు గత రెండేళ్లుగా కొనసాగుతున్నాయని, మరో నాలుగు మెడికల్ కళాశాలలు గత ఏడాది ప్రారంభం కావాల్సి ఉందన్నారు. గత ఏడాది మెడికల్ కళాశాలల ప్రారంభాలను ఆపి ప్రస్తుతం వాటిని పీపీపీ విధానం పేరుతో ఎలా పంచుకోవాలనే దానిపై కూటమి నాయకులు ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారన్నారు. ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి నిర్ణయం వెనక్కి తీసుకునేలా కృషిచేస్తామన్నారు.