
రాజకీయ జోక్యంతో విచారణ మమ
● కొండను తవ్వి ఎలుకను పట్టిన అధికారులు
● వచ్చారు 6ఏ కేసు పెట్టి సరిచేసి వెళ్లారు..
సాక్షి టాస్క్‌ఫోర్స్ : దువ్వూరులో గురువారం రాత్రి యూరియా అక్రమంగా తరలిస్తుండటంపై ‘రాత్రి అక్రమంగా యూరియా తరలింపు’ అనే శీర్షికతో శుక్రవారం సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై విచారణ చేయడానికి జిల్లా వ్యవసాయాధికారి (జేడీఏ) చంద్రానాయక్, మైదుకూరు ఏడీఏ కృష్ణమూర్తి, ఏఓ అమరనాథరెడ్డి, దువ్వూరు ఎస్‌ఐ వినోద్‌కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. ముందుగా ఏడీఏ కృష్ణమూర్తి శ్రీమహానందీశ్వర ట్రేడర్స్ వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. విచారణ ప్రారంభంలో జాయింట్ కలెక్టర్ షాపును సీజ్ చేయమని చెప్పారని, తప్పు ఎవరు చేసినా ఉపేక్షించొద్దని చెప్పారని ఏడీఏ మీడియాతో చెప్పుకొచ్చారు. అనంతరం జేడీఏ చంద్రానాయక్ షాపు వద్దకు వచ్చారు. జేడీఏతో ఏడీఏ కృష్ణమూర్తి, ఏఓ అమరనాథ్ రెడ్డిలు ఈ ట్రేడర్స్‌కు గురువారం సాయంత్రం 9 టన్నుల యూరియా వచ్చిందన్నారు. ప్రస్తుతం 7.8 టన్నుల యూరియా నిల్వ ఉందని, 1.2 టన్నుల యూరియాను గురువారం రాత్రి అక్రమంగా విక్రయించినట్లు తెలిపారు. జేడీఏ వ్యవసాయాధికారులతో కలిసి ప్రొద్దుటూరు రోడ్డులో ఉన్న ఆ షాపు గోడౌన్ వద్దకు చేరుకుని అక్కడ ఉన్న యూరియా బస్తాలను లెక్కించారు. మొదట 77 బస్తాల యూరియాను అక్రమంగా అమ్మినట్లు గుర్తించారు. నాటకీయ పరిణామాల మధ్య అకస్మాత్తుగా 57 బస్తాలు తక్కువ ఉన్నాయని, 30 బస్తాల యూరియా మరో గోడౌన్‌లో ఉన్నాయని అధికారులు కొత్త కథ చొప్పుకొచ్చారు. ఈ ట్రేడర్స్‌కు చెందిన మరొక గోడౌన్‌ను తనిఖీ చేయడానికి అధికారులు వెళ్లారు. అక్కడికి వెళ్లాక జేడీఏ, ఇతర వ్యవసాయాధికారులు 45 నిమిషాలు వేచివున్నా కూడా ట్రేడర్స్ వారు తాళాలు తీయలేదు. చివరకు వ్యవసాయాధికారులు తాళాలు తెప్పించి ఆ గోడౌన్‌ను తనిఖీ చేయగా రాజకీయ జోక్యంతో నాటకీయ పరిణామాల మధ్య అధికారులు మహానందీశ్వర ట్రేడర్స్‌పై అమితమైన ప్రేమనుకనబరిచి లేదు కేవలం 27 బస్తాలు మాత్రమే తక్కువగా ఉన్నాయని క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం. ఆ 27 బస్తాల యూరియా అతను బ్లాక్ మార్కెట్‌కు తరలించలేదని, అది కూడా వారికి తెలిసిన రైతులకు డీబీటీ ప్రకారం ఇచ్చారని అధికారులు చెప్పడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. గురువారం సాయంత్రం ఆ షాపుకు 9 టన్నుల యూరియా వస్తే అదే రోజు రాత్రి యూరియాను అక్రమంగా తరలిస్తుండగా రైతులు నిలదీశారు. కానీ వ్యవసాయాధికారులు షాపు వారు డీబీటీ ప్రకారం యూరియాను ఎత్తించారనడం కొస మెరుపు. మొత్తం మీద విచారణను మసి పూసి మారేడు కాయ చేసి తూ.తూ. మంత్రంగా ఉన్న యూరియాను సీజ్ చేసి 6ఏ కేసు నమోదు చేసి ఆ ట్రేడర్స్‌పై భక్తిని చాటుకుని విచారణను మమ అనిపించారు. అధికారులు అనుకుంటే ఏమైనా చేయగలరని ప్రజలు చెప్పుకుంటున్నారు. అధిక ధరలకు యూరియా అమ్ముతున్నారని పత్రికల్లో కథనాలు వస్తున్నా విచారణకు వచ్చిన వ్యవసాయాధికారులు అధిక ధరలపై ఒక్క షాపుపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు చర్చించుకుంటున్నారు.