
ఓంకారేశ్వర్ కుటుంబానికి ఆర్థికసాయం
కడప కోటిరెడ్డిర్కిల్ : రామాపురం మోడల్ స్కూలులో ఒకేషనల్ ఐటీ ట్రేడ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓంకారేశ్వర్ కుటుంబానికి సహచరులు ఆర్థికసాయం అందజేసి తమవంతుగా తోడ్పాటు అందించారు. ఓంకారేశ్వర్ ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఈ క్రమంలో స్కిల్ ట్రీ కంపెనీ లిమిటెడ్ ఒకేషనల్ ట్రైనర్స్, ఒకేషనల్ కో ఆర్డినేటర్స్ సహకారంతో రూ. 1,15,000 సేకరించి ఆ మొత్తాన్ని శుక్రవారం మృతుడి సతీమణి అమృతకు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఆర్థికసాయం అందించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఒకేషనల్ ఉపాధ్యాయురాలు సురేఖ, కో ఆర్డినేటర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
8మంది పేకాటరాయుళ్ల అరెస్టు
వేంపల్లె : స్థానిక గండి – పులివెందుల బైపాస్ రోడ్డు సమీపంలో జూదమాడుతున్న 8 మందిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తిరుపాల్ నాయక్ తెలిపారు. శుక్రవారం సీఐ నరసింహులు ఆదేశాల మేరకు గండి – పులివెందుల బైపాస్ రోడ్డు సమీపంలో పేకాట ఆడుతున్న వారిపై ఎస్‌ఐ తిరుపాల్ నాయక్ తన సిబ్బందితో దాడులు చేశారు. దీంతో వెంకటరమణతోపాటు మరో 7 మందిని అరెస్టు అదుపులోకి తీసుకుని రూ.82,300 నగదును స్వాధీనం చేసుకోవడంతోపాటు వారిపై కేసు నమోదు చేశామన్నారు.
మునయ్యకోనలో
మృతదేహం లభ్యం
ముద్దనూరు : ముద్దనూరు–జమ్మలమడుగు రహదారిలోని మునయ్యకోనలో చిట్టిబోయిన గంగాధర్(53)అనే వ్యక్తి మృతదేహాన్ని శుక్రవారం పోలీసులు గుర్తించారు. సీఐ దస్తగిరి సమాచారం మేరకు.. తొండూరు మండలం గంగాదేవిపల్లెకు చెందిన గంగాధర్ రెండురోజుల క్రితం ఇంటినుంచి బయటకు వెళ్లాడు. మునయ్యకోనలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. మరణానికి చెంనని కారణాలు ఇతర వివరాలపై విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.
నిందితులకు జైలు
పోరుమామిళ్ల : పోరుమామిళ్ల ఫారెస్టు రేంజ్‌లో 2019 ఎర్రచందనం కేసులో తిరుపతి కోర్టులో శుక్రవారం మల్లేపల్లె గ్రామానికి చెందిన నిందితులు కప్పలరమేష్, గురుప్రసాద్‌లకు 5 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.6 లక్షలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
రూ.11లక్షలు మోసం చేసారని కేసు
ముద్దనూరు : మండలంలోని పెద్ద దుద్యాల గ్రామ సమీపంలోని జీయమ్ ఎకో కంపెనీకి చెందిన రూ.11లక్షల 54వేల సొమ్మును మోసం చేసారని కోకా ప్రదీప్, అతని భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఏఎస్‌ఐ రమణ సమాచారం మేరకు జీయమ్ ఎకో కంపెనీలో విశాఖపట్టణంకు చెందిన ప్రతీప్ మేనేజర్‌గా, అతని భార్య అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. కంపెనీకి చెందిన లారీల బాడీ తయారీకి గ్యారేజీలో రూ.11లక్షల 54వేల సొమ్మును చెల్లించినట్లు ప్రదీప్ కంపెనీని మోసగించి, డబ్బు చెల్లించినట్లు నకిలీ లావాదేవీల పత్రాలు సృష్ఠించాడు. కొద్దిరోజుల అనంతరం కంపెనీ ఎండీ కనక ప్రసాద్ గ్యారేజీ ప్రతినిధులను సంప్రదించగా తమకు ఎటువంటి డబ్బు ముట్టలేదని వారు తెలిపారు. ప్రదీప్‌ను విచారించడానికి ప్రయత్నించగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వుండడంతో ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.