
అట్టర్‌ఫ్లాప్ పాలనకు విజయోత్సవాలా?
కడప కార్పొరేషన్: కూటమి అట్టర్‌ఫ్లాప్ పాలనకు విజయోత్సవాలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా విమర్శించారు. కడపలో శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 10వ తేదీ కూటమి నేతలు అనంతపురంలో ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలించి విజయోత్సవ సభ నిర్వహించడం విచిత్రంగా ఉందన్నారు. పదహారు నెలలుగా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో.. 5లక్షల పింఛన్లు తొలగించడం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయడంలో.. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా మోసం చేయడంలో సూపర్ హిట్ సాధించారని ఎద్దేవా చేశారు. 87లక్షల మందికి ‘తల్లికి వందనం’ ఇవ్వాల్సి ఉండగా, 54లక్షల మందికే ఇచ్చి, 16 నెలల్లో ఒక సిలిండర్ మాత్రమే ఉచితంగా ఇచ్చి, 5 రకాల సర్వీసుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పించి బంపర్‌హిట్ కొట్టారని ఎద్దేవా చేశారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి మొదటి ఏడాది పంగనామం పెట్టారని, రెండో ఏడాది రూ.5వేలు మాత్రమే ఇచ్చి 7లక్షల మందికి కోత వేశారన్నారు. యాభై ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు ఇస్తామని మోసగించారన్నారు. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కళాశాలను స్థాపించలేదని, ఐదేళ్లు సీఎంగా పనిచేసిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి మొనగాడుగా నిలిచారన్నారు. వాటిలో 10 మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం ప్రైవేటుకు అమ్మేయాలను కోవడం దారుణమన్నారు. సచివాలయాలు, ఆర్‌బీకేలను నిర్వీర్యం చేయడంలో..రైతులకు యూరియా దొరక్కుండా చేయడంలో ఈ ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. వలంటీర్ల జీతం పదివేలకు పెంచుతామని చెప్పి ఆ వ్యవస్థనే ఎత్తేశారన్నారు. ప్రభుత్వ బడులు, వైద్యశాలలను.. ఆరోగ్యశ్రీ పథకాన్ని పతనావస్థకు తీసుకుపోయారన్నారు. కూటమి నేతలు విజయోత్సవ సభ నిర్వహించిన జిల్లాలోనే ఓ టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తీవ్రంగా అవమానిస్తే అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు దక్కిన గౌరవం ఇదేనని ఎద్దేవా చేశారు. ఇక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, పార్టీ నాయకులు బీహెచ్ ఇలియాస్, టీపీ వెంకటసుబ్బమ్మ, జమీల్, అజ్మతుల్లా, త్యాగరాజు, బసవరాజు, కంచుపాటి బాబు, అహ్మద్ పాల్గొన్నారు.
అన్ని వ్యవస్థలను నిర్వీర్యం
చేయడంలో సూపర్‌హిట్
పదిహేనేళ్లు ఒక్క మెడికల్ కాలేజీని స్థాపించారా?
17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల
మంజూరు ఘనత వైఎస్ జగన్‌ది
మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా