
ప్రమాదమా.. హత్యాయత్నమా..?
● జేఎన్‌టీయూ హాస్టల్ వార్డెన్‌కు
తీవ్ర గాయాలు
● అందుబాటులోకి రాని
108 వాహనం
పులివెందుల : పట్టణంలోని ఎర్రగుడిపల్లెకు చెందిన ఆనందరావు పులివెందుల జేఎన్‌టీయూ కళాశాలలో హాస్టల్ వార్డెన్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం ఆనందరావు జేఎన్‌టీయూ సమీపంలో తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన తన ద్విచక్ర వాహనంతో సహా గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నాడు. దీన్ని గమనించిన స్థానికులు అతడిని కాపాడే ప్రయత్నాలు చేశారు. పోలీసు సిబ్బందికి, 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. దీంతో పులివెందుల ట్రైనింగ్ ఎస్‌ఐ అనిల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును చూస్తే ఆనందరావు బైకు అదుపు తప్పి ప్రమాదం జరిగిందా లేకపోతే ఎవరైనా వ్యక్తులు దాడి చేశారా అనేది అనుమానాం కలుగుతోంది. స్థానికులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
అందుబాటులోకి రాని 108 వాహనం :
జేఎన్‌టీయూ సమీపంలో తీవ్రంగా గాయపడిన ఆనందరావును స్థానికులు గుర్తించి 108 వాహనానికి ఫోన్ చేశారు. అయితే సంఘటన జరిగిన అర్ధ గంటసేపు అయినా కూడా 108 వాహనం చేరుకోలేదు. దీంతో స్థానికులు, పోలీసులు అటువైపు వస్తున్న వాటర్ క్యాన్ ఆటోలో క్షతగాత్రుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆనందరావు పూర్తిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆనందరావు కోలుకుంటే ప్రమాదమా.. హత్యాయత్నమా అనే విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ సీతారామిరెడ్డి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకుని సంఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.