
ఉల్లి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
కడప సెవెన్‌రోడ్స్ : మార్క్ ఫెడ్ ద్వారా ప్రారంభమైన మైదుకూరు, కమలాపురం ఉల్లి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ అదితిసింగ్ అన్నారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఉద్యాన, మార్క్ ఫెడ్ అధికారులతో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్వింటా ఉల్లి ధర రూ.1200 ప్రకారం ఈ–క్రాప్ నమోదు చేసుకున్న రైతుల నుంచి మార్క్ ఫెడ్ కొనుగోలు చేస్తుందన్నారు. మైదుకూరు, కమలాపురం మార్కెట్ యార్డుల ఆవరణలో ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయన్నారు. ఉల్లి రైతులకు నష్టం వాటిల్లకుండా, నాణ్యత పరిగణలోకి తీసుకుని కొనుగోలు ప్రక్రియ చేపట్టినట్లు జేసీ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవిచంద్రబాబు, మార్క్‌ఫెడ్ అధికారి పరిమళ జ్యోతి, మార్కెటింగ్ ఏడీ ఆజాద్‌వలి, తదితరులు పాల్గొన్నారు.