
పట్టాలు తప్పిన రైల్వే ఆదాయం
ఉచిత బస్ ఎఫెక్ట్
రాజంపేట: కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీ్త్రలకు ఉచిత బస్సు పథకం.. రైల్వే ఆదాయానికి గండికొండుతోంది. నిత్యం రద్దీగా ఉండే ప్యాసింజర్ రైళ్లు.. ఇప్పుడు వెలవెలబోతున్నాయి. మహిళా ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. దీంతో మహిళా బోగీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే రైళ్లలో కేంద్ర ప్రభుత్వం రాయితీలు తొలగిస్తూ వస్తున్న క్రమంలో.. ఈ పథకం రైల్వే ఆదాయానికి మరో దెబ్బ కొట్టింది. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కేంద్రం ఏ దిశగా అడుగులు వేస్తోందో.. వేచి చూడాల్సిందే.
● ఉభయ జిల్లాల మీదుగా మార్గంలో 25 స్టేషన్లు ఉండగా, డైలీ 30 (అప్ అండ్ డౌన్) రైళ్లు నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకంతో రైల్వేలకు వస్తున్న ఆదాయం పట్టాలు తప్పుతోంది. ఇప్పటి నుంచే అధికారుల్లో ఎర్నింగ్స్(ఆదాయం)పై ఆందోళన రోజురోజుకు హెచ్చరిల్లుతోంది. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలోని రైలుమార్గంలో నడిచే నంద్యాల–రేణిగుంట డెమో ప్యాసింజర్, అరకోణం నుంచి కడప వరకు నడిచే అరక్కోణం, తిరుపతి నుంచి హుబ్లీ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై ఉచిత బస్ (సీ్త్రశక్తి పథకం) ప్రభావం పడింది. ఫలితంగా రైల్వే ఆదాయనికి ఉచిత బస్ (ఆర్టీసీ) గండికొట్టిందనే రైల్వే నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు మోదీ సర్కారు రాయితీలను రానురాను తీసేసుకుంటూ వస్తోంది. జర్నలిస్టుల పాస్‌లతోపాటు అన్ని రకాల రాయితీలకు మంగళం పాడిన సంగతి విదితమే. రైల్వేకమర్షియల్ విభాగాన్ని.. ఇప్పుడు ఉచితబస్‌తో ఎర్నింగ్స్ కోల్పోతున్న అంశం వేధిస్తోంది.
రైలు ప్రయాణానికి మహిళలు దూరం
ఏ రైలులో అయినా గార్డుబ్రేక్ ముందు ఉండే లేడీస్‌కోచ్‌లో సీట్ల కోసం మహిళలు పోటీపడే పరిస్థితులు నిత్యం కొనసాగుతుండటం విదితమే. ప్రతి స్టేషన్‌లో అధికంగా మహిళలు ఈ కోచ్‌లో సీటు కోసం పోటీ పడుతుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. లేడీస్‌కోచ్‌లో కనీసం పదిమంది కూడా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై ఆసక్తి చూపుతుండటమే.. ఇందుకు కారణమని రైల్వే వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. పైగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా ఉచితమే అన్న భావనలో రైలు ప్రయాణాలకు స్వస్తి చెపుతుండటం గమనార్హం.
చాలా బోగీల్లో ఖాళీగా సీట్లు
ముంబయి–చైన్నె రైలు మార్గంలోని ఉమ్మడి కడప జిల్లా మీదుగా నడిచే ప్యాసింజర్ రైళ్లు బోసిపోతున్నాయి. ప్రయాణపు ధర తక్కువ అయిన క్రమంలో మహిళా ప్రయాణికులతో రద్దీగా ఉండేవి. ఇప్పుడు ఆ దృశ్యాలు రైలు బోగీలు దూరమయ్యాయి. చాలా మటుకు సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.
ఖాళీగా మహిళా బోగీలు
ప్రతి స్టేషన్‌లో పడిపోయిన రాబడి
బోసిపోతున్న ప్యాసింజర్ రైళ్లు
రైల్వే అధికారుల్లో ఆందోళన
ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా సమాచారం
మార్గం: ముంబయి–చైన్నె
రైళ్లు : 30 (అప్ అండ్ డౌన్)
స్టేషన్లు: 25
కిలోమీటర్లు: 180
ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా రైలు మార్గంలో ప్రతి రైల్వేస్టేషన్‌లో ఎర్నింగ్స్ పడిపోతున్నాయి. ప్రధానంగా ప్యాసింజర్ రైళ్ల ప్రయాణంలో ఈ పరిస్థితి చోటుచేసుకుంది. పేదోడి రైళ్లుగా నడు స్తున్న వీటిలో.. తక్కువ వ్యయంతో గమ్యాలకు చేరుకోవచ్చన్న భావనలో మహిళలు ప్రయాణాలు సాగించేవారు. ఇప్పుడు ఆర్టీసీ ఉచిత బస్సుతో రైలు ప్రయాణాలపై ఆసక్తి చూపడం లేదు. కడప నుంచి ఒంటిమిట్ట, నందలూరు, తిరుపతి, కాణిపాకం, తిరుచానూరు, శ్రీకాళహస్తి లాంటి పుణ్యక్షేత్రాలకు నంద్యాలడెమో, ఇంటర్‌సిటీ, అరకోణం రైళ్లను మహిళలు ఆశ్రయించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. నంద్యాల నుంచి కడప, తిరుపతి కానీ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఫలితంగా ఈ మూడు రైళ్లు ఆగే స్టేషన్‌లలో ఎర్నింగ్ పడిపోతున్నాయి.

పట్టాలు తప్పిన రైల్వే ఆదాయం

పట్టాలు తప్పిన రైల్వే ఆదాయం

పట్టాలు తప్పిన రైల్వే ఆదాయం