
రాత్రి అక్రమంగా యూరియా తరలింపు
దువ్వూరు: మండలంలో రాత్రిళ్లు అక్రమంగా యూరియా బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతోంది. నిజమైన రైతులకు యూరియా అందక ఎండకు క్యూలో నిలుచొని అష్టకష్టాలు పడుతుంటే.. ప్రైవేట్ వ్యాపారులు మాత్రం రూ.400 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. ఎవరు ఎక్కువ ధర ఇస్తే వారికి ఏ సమయంలోనైనా యూరియా దొరుకుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఏఎస్పీ గత నెలలో దువ్వూరులోని ఫర్టిలైజర్స్ దుకాణాలపై దాడులు చేసి హెచ్చరించినా.. వ్యాపారుల తీరు మారలేదు. దువ్వూరుకు చెందిన మహానందీశ్వర ట్రేడర్స్ గురువారం రాత్రి 9 గంటల సమయంలో మూడు ఆటోల్లో యూరియాను అక్రమంగా తరలిస్తుండగా.. సమీపంలో ఉన్న దళితవాడ రైతులు యూరియా మాకు ఇమ్మంటే లేదన్నారు, ఈ సమయంలో ఎక్కడికి తరలిస్తున్నారని అడ్డుకున్నారు. ‘మా ఇష్టం మేము ఏ సమయంలోనైనా అమ్ముకుంటాం, మీరెవరు అడ్డుకునేది’ అంటూ షాపు సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు.
నిజమైన రైతులకు అందడం లేదని ఆవేదన
మరో పక్క వ్యవసాయాధికారులు దువ్వూరు మండలానికి 980 టన్నుల యూరియా ఇంత వరకు వచ్చిందని చెబుతున్నారు. ఆ యూరియాలో ఎంత శాతం రైతులకు అందిందో, పక్కకు ఎంత తరలిపోయిందో అధికారులే లెక్క తేల్చాలి. ఇంత స్థాయిలో యూరియా పంపిణీ చేసినా రైతులకు అందకుండా ఇలా రాత్రిళ్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతుంటే... నిజమైన రైతులకు యూరియా ఎక్కడ అందుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియాను సక్రమంగా పంపిణీ చేయని అధికారులు.. అవసరం లేకున్నా యూరియా వాడుతున్నారని, రైతులపైనే నిందలు మోపుతున్నారు. దువ్వూరు మండలంలో 13,500 ఎకరాల్లో పంటలను సాగు చేయగా, అందులో దాదాపు 60 శాతంపైన కేసీ కెనాల్ పరిధిలో రైతులు వరి సాగు చేశారు. ఒక ఎకరాకు ఎంత తక్కువ అన్నా మూడు బస్తాల యూరియా పడుతుందని, కానీ ఒక బస్తా కూడా దొరకడం కష్టంగా ఉందని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ అధికారులు ఇప్పటికై నా యూరియా పక్కకు తరలిపోకుండా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
విచారణ చేస్తాం
ఈ విషయంపై మండల వ్యవసాయాధికారి అమరనాథ్‌రెడ్డిని వివరణ కోరగా దువ్వూరు మండలానికి 52 టన్నుల యూరియా మంజూరైందన్నారు. ఆ యూరియాను శుక్రవారం రైతు సేవా కేంద్రాల ద్వారా, ప్రైవేట్ దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్నామన్నారు. అయితే దువ్వూరులోని మహానందీశ్వర ట్రేడర్స్ వారు రాత్రి 9 గంటల సమయంలో ఆటోలో యూరియాను తరలించడం తప్పని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అడ్డుకున్న రైతులు
దురుసుగా ప్రవర్తించిన ‘ఫర్టిలైజర్స్’ సిబ్బంది

రాత్రి అక్రమంగా యూరియా తరలింపు