అయ్యా.. ఇవ్వండి యూరియా
చాపాడు : అయ్యా.. ఇవ్వండి యూరియా అంటూ మండలంలోని అల్లాడుపల్లెకు వచ్చిన వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ చంద్రానాయక్‌ను అల్లాడుపల్లె, లక్ష్మీపేట, శ్రీరాములపేట, పెద్ద గురవలూరు గ్రామాల రైతులు నిలదీశారు. జేడీఏను చుట్టుముట్టి యూరియా కోసం తాము పడుతున్న అవస్థలు విన్నవించారు. రైతుసేవా కేంద్రాల ద్వారా యూరియా తెప్పించి సరిపడేంత అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రైవేట్ దుకాణాల్లో బస్తా రూ.400–500 వరకు పెట్టి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఒక బస్తా ఇస్తే పంటలు ఎలా సాగు చేయాలని వారు ప్రశ్నించారు. దీనికి స్పందించిన జేడీఏ మాట్లాడుతూ యూరియా వాడకాన్ని వరిపైరులో తగ్గించాలని, ఎకరాకు 75 కిలోలు మూడు విడతల్లో అందించుకోవాలని సూచించారు. మామూలు యూరియా బదులు నానో యూరియా వాడితే డబ్బు ఆదా అవుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ కృష్ణమూర్తి, వ్యవసాయాధికారి దేవీపద్మలత, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జేడీఏను చుట్టుముట్టి నిలదీసిన రైతులు


