
‘అన్నదాత పోరు’ గ్రాండ్ సక్సెస్
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు చేపట్టిన ‘అన్నదాత పోరు’ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అన్నదాత పోరు’ను అడ్డుకోవాలని ప్రభుత్వం పోలీసుల ద్వారా నోటీసులు ఇప్పించి, కేసులు పెడతామని బెదిరించినా రైతులు, రైతు కార్మికులు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వాటికి లొంగకుండా రోడ్లపైకి వచ్చారన్నారు. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తామని చెప్పినా .. పోలీసులు అడుగడుగునా అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని చూశారన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వాన్ని దించే పరిస్థితి రావాలన్నారు. వ్యవసాయానికి సంబంధించి ముందస్తు ప్రణాళిక అనేదే లేకుండా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. రాష్ట్రా నికి 8లక్షల టన్నుల యూరియా కావాల్సి ఉంటే ముందే ప్లాన్ చేసి ఏప్రిల్, మే నెలల్లోనే కేంద్రానికి ఇండెంట్ ఇవ్వకుండా తాత్సారం చేసిందన్నారు. తీరా రైతులకు యూరియా అవసరమయ్యే సమయానికి ప్రభుత్వం వద్ద నిల్వలు లేవని, దీంతో ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు యూరియా వేసిన వరి తింటే కేన్సర్ వస్తుందని చెప్పడం సరికాదన్నారు. అలాగే 100 శాతం యూరియాను ప్రైవేటు డీలర్లకే అప్పగించడం వల్ల రూ.270కి అమ్మాల్సిన క్వింటా యూరియాను రూ.700–800లకు అమ్ముతున్నారన్నారు. ఇందులో సుమారు రూ.400కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలను ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వారం పదిరోజుల్లోనే 15 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. అడుగడుగునా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తూనే ఉందన్నారు.
ఎవరిని మభ్యపెట్టడానికి ఈ సభలు...?
సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అయ్యాయని కూటమి పార్టీల నేతలు సభ నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇంకా ఎవరిని మభ్యపెట్టడానికి ఈ సభలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. పింఛన్ రూ.4వేలకు పెంచి 5లక్షల పింఛన్లు తొలగించారని, 19 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి అసలే లేదన్నారు. సంబటూరు ప్రసాద్‌రెడ్డి, పార్టీ నేతలు పులి సునీల్‌కుమార్, బీహెచ్ ఇలియాస్ పాల్గొన్నారు.
పోలీసులు నోటీసులిచ్చి బెదిరించినారైతులు వెనకడుగు వేయలేదు
ప్రభుత్వం రైతులకు అడుగడుగునా మోసం చేసింది
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడుపి. రవీంద్రనాథ్‌రెడ్డి