
బీసీ మున్సిపల్ చైర్‌పర్సన్ అని చులకనా!
రాత్రంతా కౌన్సిల్ హాల్‌లోనే...
ప్రొద్దుటూరు: గత నెలలో ఎందుకు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదు..? తాను సమావేశం పెట్టాలని సమాచారం పంపినా ఎందుకు స్పందించలేదు.. అంటూ మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డిని ప్రశ్నించారు. తాను బీసీ మున్సిపల్ చైర్‌పర్సన్ అని చులకనగా చూస్తున్నారా? అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి మున్సిపల్ చైర్‌పర్సన్ అధ్యక్షత వహించారు. గత నెలలో సాధారణ సమావేశం నిర్వహించాలని, తర్వాత అత్యావసర సమావేశం నిర్వహించాలని వాట్సాప్‌లో మెసేజ్ పెట్టానని, సిబ్బంది ద్వారా సమాచారం అందించానని చైర్‌పర్సన్ తెలిపారు. అయినా ఎందుకు స్పందించలేదని కమిషనర్‌ను ప్రశ్నించారు. కమిషనర్ వాట్సాప్ మెసేజ్ కూడా తీసుకున్నారని చైర్‌పర్సన్‌తోపాటు వైస్ చైర్మన్లు ఆయిల్ మిల్ ఖాజా, పాతకోట బంగారు మునిరెడ్డి తెలిపారు. దీనిపై కమిషనర్ ఎంతకూ స్పందించకపోవడంతో పోడియం వద్ద వైఎస్సార్‌సీపీ మహిళా కౌన్సిలర్లు బైఠాయించారు. చైర్‌పర్సన్‌కు సమాధానం ఇవ్వకపోవడం అంటే చైర్‌పర్సన్‌ను అవమానించినట్లేననే వైఎస్సార్‌సీపీ సభ్యులు తెలిపారు. ఎక్స్ అఫిసియో సభ్యుని హోదాలో హాజరైన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కమిషనర్ సారీ చెప్పాల్సిన అవసరం లేదని, జవాబు ఇవ్వాల్సిన పనిలేదన్నారు. మీరు ఏదైనా ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవాలే కానీ అడ్డుకోవడం తగదన్నారు. ‘కమిషనర్లు.. ప్రతి కౌన్సిలర్‌కు జవాబుదారీతనంగా ఉండాలని.. గతంలో మీరు చెప్పిన సూచనలు ఏమయ్యాయని వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని సూటిగా ప్రశ్నించారు. సుమారు అరగంటకుపైగా సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. చైర్‌పర్సన్, వైస్ చైర్మన్లు, సభ్యులకు సమాధానం ఇవ్వకుండానే కమిషనర్, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్ది వెంట సమావేశం నుంచి వెళ్లిపోయారు. తిరిగి సమావేశం నిర్వహించే వరకు తాము ఇక్కడే కూర్చుంటామని చైర్‌పర్సన్‌తోపాటు వైస్ చైర్మన్లు, సభ్యులు సమావేశ మందిరంలోనే నిరసన తెలిపారు. ఈ విషయంపై మున్సిపల్ చైర్‌పర్సన్ ఆర్డీడీకి ఫోన్‌లో కమిషనర్‌పై ఫిర్యాదు చేశారు. ఉద్దేశ పూర్వకంగానే ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఎగ్జిబిషన్ వేలం పాట నిర్వహించకూడదని, మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండా జాప్యం చేశారని వైస్ చైర్మన్లు ఆరోపించారు. కొత్తపల్లె పంచాయతీ పరిధిలో టీడీపీ వర్గీయులు కొత్తగా ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నారని, అందుకోసమే మున్సిపాలిటీలో ఎగ్జిబిషన్ నిర్వహించకుండా వాయిదా వేస్తారా అని ప్రశ్నించారు.
ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాల్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైస్ చైర్మన్లు పాతకోట బంగారు మునిరెడ్డి, ఆయిల్ మిల్ ఖాజాతోపాటు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు మంగళవారం రాత్రంతా గడిపారు. ఈ విషయమై చైర్‌పర్సన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తాము మీటింగ్ హాల్లోనే ఉన్నామని.. అజెండా ప్రకారం సమావేశం నిర్వహించాలని కమిషనర్‌కు తెలిపారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వని కమిషనర్
ఎమ్మెల్యే వరద వెంట వెళ్లడంతోబైఠాయించిన కౌన్సిలర్లు