
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
గాయపడిన ప్రసాద్, శ్రీను, ప్రొద్దుటూరు ఆసుప్రతిలో వైద్యులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని చిలంకూరు గ్రామ పరిధిలోని సిర్రాజుపల్లి రోడ్డులో జేసీబీ యంత్రం పనులు చేస్తుండగా అదే మార్గంలో పోతున్న బైక్‌ను ఢీకొన్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైకుపై పోతున్న మల్లికప్రసాద్ (40), యర్రగుళ్ల శ్రీను, శివశంకర్‌లకు గాయాలయ్యాయి. వీరిలో మల్లికప్రసాద్‌కు తీవ్ర గాయాలుకాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వెంటనే జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టరు మూలె సుధీర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం యర్రగుంట్ల పట్టణ సీఐ విశ్వనాథ్‌రెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు... సిర్రాజుపల్లి గ్రామానికి చెందిన మల్లికప్రసాద్, దండుపల్లి గ్రామానికి చెందిన యర్రగుళ్ల శ్రీను, శివశంకర్‌లు ముగ్గురు సిర్రాజుపల్లి రోడ్డు నుంచి బైక్‌లో చిలంకూరుకు బయలు దేరారు. చిలంకూరు గ్రామ సమీపంలోని స్మశాన వాటిక వద్దకు రాగానే జేసీబీ రోడ్డుకు అనుకుని పనులు చేస్తోంది. జేసీబీ ఆపరేటర్ ముందు భాగాన పనులు చేస్తుండగా వెనుక భాగాన ఉన్న జేసీబీ పళ్ల తొట్టి రోడ్డుకు దగ్గరలో ఉంది. అదే సమయంలో బైక్‌పైన ప్రసాద్, శ్రీను, శివశంకర్‌లు పోతుండుగా జేసీబీ తొట్టి తగిలింది. దీంతో బైక్‌పై ఉన్న ప్రసాద్ ఎగిరి తొట్టికి ఉన్న ఇనుప పళ్ల మధ్య ఇరుక్కోవడంతో ఇనుప పళ్లు ప్రసాద్ ఛాతీపై దిగింది. మిగిలిన ఇద్దరు శ్రీను, శివశంకర్ స్వల్పగాయాలతో బయట పడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన ముగ్గురికి ప్రొద్దుటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రసాద్ పరిస్థితి విషమించడంతో కర్నూల్ కు తరలించారు. అక్కడ నుంచి హైదరాబాదుకు తరలించినట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని సీఐ విశ్వనాథ్‌రెడ్డి పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు