
సాగు భూముల్ని కార్పోరేట్లకు కట్టబెడుతున్న బీజేపీ
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : సాగు భూముల్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడంతో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టబడుతోందని వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత అధ్యక్షులు విజయ రాఘవన్ అన్నారు. మంగళవారం కడప నగరంలోని హరిత హోటల్ ఆవరణంలో జాతీయ సమావేశాలు ప్రారంభ సూచిక సందర్భంగా జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ పంపిణీ సాగునీరు ఉపాధి హామీకై వ్యవసాయ కార్మికులు ఉద్యమించి పోరాడాలని పిలుపునిచ్చారు. విదేశీ పెట్టుబడులపై ఆధారపడి ఊహాజనితమైన పథకాలతో భూములు సేకరించి వ్యవసాయాన్ని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నదని, రైతుల్ని వ్యవసాయ కూలీలను అభద్రతకు భయభ్రాంతులకు పాలకులు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. బలవంతపు భూ సేకరణ వల్ల అభివృద్ధి జరగలేదని దీనివల్ల లక్షలాది రైతులు కూలీలు వృత్తిదారుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. నేడు నూతన ఆర్థిక విధానాల వల్ల వ్యవసాయ రంగం మొత్తం దివాలా తీస్తోందని, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున వలస బాట పడుతున్నారని, సన్న ,చిన్నకారు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఇవి ఏమాత్రం పట్టడం లేదన్నారు. ఈ సమావేశంలో అఖిలభారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి విజు కృష్ణ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి వెంకట్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు దడాల సుబ్బారావు, వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్, అన్వేష్, జిల్లా ఉపాధ్యక్షులు జి చంద్రశేఖర్, జిల్లా రైతు సంఘం కార్యదర్శి దస్తగిరి రెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి బి మనోహర్, జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాసులు రెడి,్డ జిల్లా నాయకులు ఏ రామ్మోహన్ పాల్గొన్నారు.
వ్యవసాయ రంగ సంక్షోభం పుస్తకం ఆవిష్కరణ
అఖిల భారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ ఏపీ రైతు సంఘం రాష్ట్ర కమిటీ ముద్రించిన కార్పోరేట్ల కబంధ హస్తాల్లో వ్యవసాయ రంగం పుస్తకాన్ని మంగళవారం కడప హరిత హోటల్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోపాలకృష్ణయ్య, దస్తగిరి రెడ్డి, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత
అధ్యక్షుడు విజయ రాఘవన్