
దొరికింది ఎంత.. దాచింది ఎంత?
● గ్యాంబ్లింగ్ సంఘటనలో అనుమానాలు ఎన్నో
● 22 మంది పేకాటరాయుళ్లు అదుపులోకి..
● రూ. 11,83,940 నగదు స్వాధీనం
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు మండల పరిధిలోని గండికోట– దప్పెర్ల రహదారిలో ముళ్లపొదల్లో భారీ ఎత్తున పేకాట ఆడుతున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌కు అజ్ఞాత వ్యక్తులు సమాచారం ఇచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు జమ్మలమడుగు పట్టణ సీఐ నరేష్‌బాబు ఎస్‌ఐ రామకృష్ణ, సిబ్బందితో కలసి దాడులు చేసి వివిధ ప్రాంతాలకు చెందిన 22 మందిని పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా వారి వద్ద నుంచి విశ్వసనీయ సమాచారం మేరకు సుమారు రూ. 80 లక్షల రూపాయలు మేరకు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు విచారిస్తే అసలు విషయం తెలుస్తుందని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
సీఐ నరేష్ బాబు విలేకరులతో మాట్లాడుతూ..
సీఐ నరేష్ బాబు మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గండికోట– దప్పెర్ల రోడ్డు మార్గంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలసి 7వ తేదీ దాడి నిర్వహించి 22 మంది పేకాటరాయుళ్ల వద్ద నుంచి రూ. 11, 83, 940 స్వాధీనం చేసుకుని నోటీసులు ఇచ్చి పంపామన్నారు. కాగా.. మండలపరిధిలోని చిటిమిటి చింతలలో ఈ నెల 7వ తేదీ పేకాట ఆడుతూ పట్టుబడిన 22 మంది మంగళవారం కొలిమిగుండ్ల మండలం అవుకు నుండి 15 లీటర్ల నాటు సారా తెచ్చుకుని గ్రామ సమీపంలో తాగుతున్నట్లు సమాచారం రావడంతో వారిని అదుపులోకి తీసుకోని కోర్టుకు హాజరు పరిచామని.. కోర్టు రిమాండ్ విధించినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు విషయం ఎంత అనే దానిపై చర్చలు సాగుతున్నాయి.
జూదరుల అరెస్ట్
కడప అర్బన్ : కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉక్కాయపల్లె దిబ్బల సమీపంలో జూదమాడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.. వారి వద్ద నుంచి రూ. 75వేలు నగదుతో పాటు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు.