
భూమి, ఉపాధి కోసం పోరుబాట
● అఖిలభారత రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ప్రధాన కార్యదర్శులు
● ఘనంగా వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : భూ పంపిణీ, సాగునీరు, ఉపాధి హామీ కోసం వ్యవసాయ కార్మికులు ఉద్యమించాలని అఖిలభారత రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ప్రధాన కార్యదర్శులు విజయ రాఘవన్, విజూ కృష్ణన్ వెంకట్, శివ దాసన్ తెలిపారు. కడపలో సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని హరిత హోటల్ నుంచి కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. నూతన ఆర్థిక విధానాల వల్ల వ్యవసాయ రంగం మొత్తం దివాలా తీస్తోందని, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున వలస బాట పడుతున్నారని తెలిపారు. సన్న, చిన్నకారు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని ధ్వజమెత్తారు. వ్యవసాయ కూలీల వలసల నివారణ కోసం ఆనాడు వామపక్ష పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని నేడు ఎన్‌డీఏ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా తూట్లు పొడుస్తోందన్నారు.
పంటలకు దక్కని గిట్టుబాటు ధర
మోదీ పాలనలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని ఢిల్లీ రైతాంగ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగినా కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం కనువిప్పు కలగలేదన్నారు. కేరళ తరహా ప్రత్యామ్నాయ విధానాలు భారతదేశ రైతులు, వ్యవసాయ కార్మికులకు కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కేంద్రం నిధులకు ఆశపడి రాష్ట్రానికి రావాల్సిన ఎరువులు, యూరియా కోసం బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయలేని పరిస్థితిలో ఉందని తెలిపారు. రానున్న కాలంలో ఎర్రజెండా ఆధ్వర్యంలో వ్యవసాయ కూలీలకు భూములు దక్కే వరకు పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేరళ వ్యవసాయ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ చంద్రన్, వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత నాయకులు విక్రమ్ సింగ్, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కన్వీనర్ లలిత బాలన్‌తోపాటు ఏపీ రైతు వ్యవసాయ కార్మిక సంఘాల అధ్యక్ష,కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, దండాల సుబ్బారావు, సీపీఎం కడప జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, నగర కార్యదర్శి ఏ.రామ్మోహన్, కడప జిల్లా రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు అన్వేష్ శివకుమార్, దస్తగిరిరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.మనోహర్ అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.