
ఇమామ్, మౌజన్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి
కడప సెవెన్‌రోడ్స్ : రాష్ట్ర వ్యాప్తంగా ఇమామ్, మౌజన్లకు ఇవ్వాల్సిన పెండింగ్ గౌరవ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర విభాగం పిలుపులో భాగంగా మైనార్టీ విభాగం జిల్లాశాఖ, నగర శాఖల సంయుక్తాధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మదీన దస్తగిరి, నగర శాఖ అధ్యక్షుడు, కార్పొరేటర్ షఫీ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎస్.గౌస్‌బాషా మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు గౌరవ వేతనం ప్రతినెల చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు. కానీ జనవరి నుంచి ఇప్పటి వరకు చెల్లించకపోవడం దారుణమన్నారు. సెప్టెంబరు వరకు ఎనిమిది నెల ల గౌరవ వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయ న్నారు. గతేడాది ఎన్నికల సమయమైన ఏప్రిల్, మే, జూన్ నెలల వేతనాలు కూడా చెల్లించలేదన్నారు. ఇలా 11 నెలల గౌరవ వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గతేడాది మార్చి వరకు వేతనాలు ఇచ్చిందని, కూటమి అధికారంలోకి వచ్చాక వేతనాలు పెండింగ్‌లో ఉంచడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. మసీదు కమిటీలు కూడా ఈ చెల్లింపులను భరించలేకపోతున్నాయన్నారు. జనవరి నుంచి సెప్టెంబరు వరకు ఉన్న పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నూర్‌బాషా కార్పొరేషన్‌కు రూ.100 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. తర్వాత జేసీ అదితిసింగ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షఫీ, నగర ప్రధాన కార్యదర్శి అక్బర్ అలీ, హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌసులాజమ్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కరీముల్లా, మైనార్టీ విభాగం మాజీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ బొగ్దాది, మున్నా తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ మైనార్టీ నేతల ఆందోళన