
దేశంలో యూరియా ఎమర్జెన్సీ విధించాలి
● అఽధిక ధరకు విక్రయిస్తే చర్యలు చేపట్టాలి
● కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నా
కడప సెవెన్‌రోడ్స్ : దేశంలో యూరియా ఎమెర్జెన్సీ విధించాలని, రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.చంద్ర కోరారు. సోమవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఎరువుల కొరత సృష్టించి అఽధిక ధరలకు విక్రయిస్తున్న డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎరువుల కేటాయింపులో రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. యూరియా అందుబాటులో లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతేడాది ఇలాంటి సమస్య రాలేదన్నారు. యూరియా నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా రైతులకు ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వస్తున్న యూరియాలో 80 శాతం ప్రైవేటు షాపులకు ఇస్తూ 20 శాతం మాత్రమే ఆర్‌ఎస్‌కే, సొసైటీలకు సరఫరా చేయడం తగదన్నారు. ఇందువల్ల బ్లాక్‌లో బస్తా రూ.400కు పైగానే అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఒక ఆధార్‌కార్డుకు ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తామనడం తగదన్నారు. డీలర్ల వద్ద యూరియా కొనుగోలుకు వెళితే యూరియాతోపాటు ఇతర ఎరువులు కూడా కొనాలని షరతు పెడుతున్నారని తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి వెంకట శివ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, సీపీఐ నాయకులు వెంకట్రాముడు, శంకర్‌నాయక్, మల్లికార్జున, భాగ్యలక్ష్మి, చంద్రశేఖర్‌రెడ్డి, ఈశ్వరయ్య, బషీర్, పక్కీరప్ప, కొండయ్య, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.