వేముల : తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో కడప రైతు బిడ్డ గజ్జెల లక్ష్మీనారాయణరెడ్డి అరుదైన జాతీయ స్థాయి పురష్కారాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. వివరాలలోకి వెళితే.. కడప జిల్లా వేముల మండలం కుప్పగుట్టపల్లె గ్రామానికి చెందిన గజ్జెల లక్ష్మీనారాయణరెడ్డి పదేళ్ల క్రితం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సిఫార్సుతో టర్బో సర్వీసెస్ రంగంలో కేవలం రూ.1400 జీతంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. చేసే పనిలో అంకితభావరం, కఠోర శ్రమతో అంచెలంచెలుగా ఎదిగారు. ఉద్యోగిగా ఉంటూనే వ్యాపార మెళకువలను ఆకలింపు చేసుకున్నారు. 2017లో కూకట్‌పల్లె కెపీహెచ్‌బీ కాలనీ కేంద్రంగా న్యూ ప్రీమియర్ టర్బో సర్వీసెస్ అనే సంస్థను స్థాపించాడు. కేవలం కొన్నేళ్లలోనే తన సంస్థను అగ్రగామిగా నిలిపాడు. సేవా రంగంలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించిన ఓ టీవీ న్యూస్ చానెల్ తెలంగాణాలో నిర్వహించిన కార్యక్రమంలో బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులు ఈనెల 5వ తేదీన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేతులమీదుగా గజ్జెల లక్ష్మీనారాయణరెడ్డి, ఆయన సతీమణి కళ్యాణిలు అందుకున్నారు. ఒకప్పుడు ఉద్యోగం కోసం ఎదురు చూసిన లక్ష్మీనారాయణరెడ్డి నేడు తన సంస్థలో 100మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.