
● ఉల్లి రైతులు, రైతు సంఘ నాయకుల ఆందోళన
పెండ్లిమర్రి మండలంలో ఉల్లి పంటను కోస్తున్న కూలీలు
కడప అగ్రికల్చర్: ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. పంట చేతికొచ్చే సరికి సరైన గిట్టుబాటు ధర కరువై కంట కన్నీరు ఆగడం లేదు. ఇటు అతివృష్టి.. అటు అనావృష్టితో రైతులు ఏటా నష్టాలపాలవుతున్నారు. అన్నింటికి తట్టుకుని పంట చేతికొస్తే ప్రభుత్వం నుంచి ‘మద్దతు’ లేక బతుకు బరువుగా మారుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది ఉల్లి రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉల్లిపంటకు సరైన మద్దత ధర లేకపోవడంతో రైతులు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్నారు. ప్రస్తుతం క్వింటాల్ ఉల్లి ధర రూ.700 నుంచి రూ. 800 పలుకుతోందని ఉల్లి రైతులు తెలిపారు. ఎకరా ఉల్లిపంట సాగుకు సేద్యాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలు..ఇలా అన్ని కలిపి రూ.70 నుంచి 80 వేల వరకు ఖర్చు వస్తుందని రైతులు తెలిపారు. దిగుబడి కూడా ఎకరాకు 50 నుంచి 70 క్వింటాల్ వరకు వస్తుందని ధర చూస్తే మాత్రం క్వింటాల్ రూ. 700 రూ. 800 పలుకుతుందని తెలిపారు. ఈ ధరకు ఉల్లిగడ్డలు అమ్మితే కనీసం సాగు ఖర్చులు కూడా రావని ఉల్లిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ధరల స్థిరీకరణ నిధి.. ఏదీ..!
రైతులు నష్టపోకుండా ఉండేందుకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో అమలుకాకపోవడంతో ఉల్లి రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి ఉల్లిపంటకు మద్దతు ధర కల్పించి రైతును ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
మద్దతు ధర లేక దిగాలుపడ్డ రైతులు
జిల్లావ్యాప్తంగా 7532 ఎకరాల్లో ఉల్లి పంటసాగు
64 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని అధికారుల అంచనా
క్వింటాల్ 7 నుంచి 8 వందల ధర పలుకుతుందన్న ఉల్లి రైతులు
సాగు ఖర్చులు కూడా రావనివాపోతున్న అన్నదాతలు
ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
ఉల్లి రైతుల పరిస్థితి కొందామంటే కొరివి, అమ్ముదామంటే అడవి అన్న చందంగా మారింది. వేలకు వేలు ఖర్చు పెట్టి ఉల్లిపంటను సాగుచేస్తే దిగుబడి వచ్చే సరికి గిట్టుబాటు ధర లేకుండా పోతోంది. మరో పది పదిహేను రోజుల్లో ఉల్లిపంటను కోయాలి. ఈ ధరలు చూస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదు.
– చక్రధర్‌రెడ్డి, ఉల్లి రైతు, సింగనపల్లె, దువ్వూరు
కనీస మద్దతు ధర క్వింటాకు 3వేల రూపాయల కల్పించాలి
ఉల్లి పంటలకు కనీస మద్దతు ధర క్వింటాకు రూ. 3 వేలు కల్పించాలి. ప్రభుత్వమేమో రూ. 1200లు ప్రకటించి కొనుగోలు చేస్తామని అంటోంది. ఈ ధరతో అమ్మితే రైతులకు కనీసం పెట్టుబడులు కూడా రావు. ఉల్లి ఎకరం సాగు చేయడానికి సుమారు 80 వేలు దాకా ఖర్చు వస్తుంది. ధర లేక రైతులు నష్టపోతున్నారు. – గాలి చంద్ర, ిసీపీఐ జిల్లా కార్యదర్శి.

● ఉల్లి రైతులు, రైతు సంఘ నాయకుల ఆందోళన