
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్: ప్రజలు సమర్పించే అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని, అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించా రు. బుధవారం కలెక్టరేట్ సభాభవన్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) లో వచ్చిన ఫిర్యాదుల పెండెన్సీపై జేసీ అదితి సింగ్‌తో కలిసి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్‌ఎస్ వ్యవస్థ నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోందన్నారు. ముఖ్యంగా, ప్రభుత్వ సేవలు, రెవెన్యూ అంశాలపై ఎక్కువగా ఫిర్యా దులు అందుతున్నాయని.. వచ్చిన ఫిర్యాదులకు సరైన పరిష్కార నివేదికలు కూడా అందడం లేదన్నారు. సంబంధిత మండల తహసీ ల్దార్లు క్షేత్రస్థాయిలో ఫిర్యాదులపై విచారణ జరపాలన్నారు. అర్జీదారుడు అందించే ఫిర్యా దుకు.. సరైన,సూటి సమాధానం ఇవ్వాలన్నా రు. తద్వారా అర్జీదారునికి సంతృప్త స్థాయిలో పరిష్కారం అందే దిశగా అధికారులు పని చేయాలన్నారు. ఈ విషయంలో జిల్లా శాఖాధిపతులు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు, ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం.. ఆయా శాఖల వారీగా ఫిర్యాదుల పెండింగ్ పై సమీక్షించి పూర్ పర్ఫార్మెన్‌న్స్ రికార్డు నమోదైన అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే..శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జేసీ అదితి సింగ్ మాట్లాడుతూ పబ్లిక్ గ్రీవెన్స్ రీ అడ్రసల్ సిస్టమ్‌లో భాగంగా శాఖల వారీగా చేపట్టల్సిన కార్యక్రమాల ప్రణాళికల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. డీఆర్‌ఓ విశ్వేశ్వరనాయుడు పాల్గొన్నారు.