
బోధనలో ఒరవడి సృష్టిస్తున్న ఖాసీంవలి
కాశినాయన : పేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులు సైతం విద్యలో రాణించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నదే ఆ ఉపాధ్యాయుడి తపన. అతడి పేరు ఖాసీంవలి. మండలంలోని బాలాయపల్లె ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తండ్రి ఖాసీం సాబ్ రిక్షా తొక్కుతూ అతనికి వచ్చిన సంపాదనలో కుమారుడు కొడుకును ఉన్నత స్థాయిలో చూడాలని చదివించాడు. తండ్రి ఆశయం కోసం అతడు ఎంతో కష్టపడి చదివి 2011లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టాడు. రాజంపేట మండలంలోని చెంచురాజుపల్లెలో 2011లో ఉపాధ్యాయుడిగా చేరి 2021 వరకు దశాబ్దకాలం పనిచేసి అటు విద్యార్థులు, ఇటు గ్రామ ప్రజల మన్ననలను పొందారు. పేదరికం అంటే ఏమిటో తెలిసిన వ్యక్తిగా ఖాసీంవలి పేద విద్యార్థులను చేరదీసి వారి ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షించి తనదైన శైలిలో చక్కగా పాఠాలు బోధించారు. చెంచురాజుపల్లె నుంచి నలుగురు విద్యార్థులను నవోదయ పాఠశాల ప్రవేశానికి శిక్షణ ఇచ్చి నలుగురు విద్యార్థులు నవోదయ పాఠశాలకు ఎంపికకావడం ఆయన ప్రతిభకు నిదర్శనంగా చెప్పవచ్చు. దాతల సహకారంతో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బోధన సామగ్రిని పంపిణీ చేయించి పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తన వంతు కృషి చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 2021లో బదిలీపై మండలంలోని పిట్టికుంట ఎంపీపీ పాఠశాలకు వచ్చారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు యూనిఫాం కుట్టించుకోవడానికి డబ్బులు లేని విద్యార్థులకు ఖాసీం వలి తన సొంత డబ్బుతో యూనిఫాం కుట్టించి మానవత్వం చాటుకున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో బాలాయపల్లె పాఠశాలకు వెళ్లారు. గ్రామస్తుల సహాయ సహకారాలతో పాఠశాల ఆవరణలో మొక్కలను నాటించి గ్రామస్తులు, మండల విద్యాశాఖ అధికారుల మన్ననలను పొందారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కడపలో నిర్వహించిన సభలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును ఖాసీంవలి కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఖాసీం వలి మాట్లాడుతూ పేదరికం కారణంగా తాను ఎన్నో ఇబ్బందులు పడి ఉపాధ్యాయుడినయ్యానని తెలిపారు. పేదరికం కారణంగా విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని తన వంతు కృషి చేస్తున్నానన్నారు. ప్రతి పేద విద్యార్థి చక్కగా చదివి ఉన్నత స్థాయికి చేరి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికై న ఖాసీంవలికి జనవిజ్ఞాన వేదిక జిల్లా, రాష్ట్ర నాయకులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.