
కర్నూలులోనే కృష్ణా నది బోర్డు ఉండాలి
– పీసీసీ డెలిగేట్ శ్రీనివాసులరెడ్డి
పులివెందుల టౌన్ : కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని పీసీసీ డెలిగేట్ వేలూరు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పులివెందులలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణానది జలాలు తెలంగాణ రాష్ట్రం తర్వాత కర్నూలు జిల్లాలోకి చేరుకుంటాయని, తెలుగుగంగ, జీఎన్‌ఎస్‌ఎస్ ప్రాజెక్టు, వెలుగోడు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ కడప జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఉన్న గండికోట ప్రాజెక్టు, తదితర ప్రాజెక్ట్‌లకు ఆధారమైన శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న కర్నూలు జిల్లాలోనే కృష్ణానది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. కృష్ణానది నీటి నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత గల శ్రీశైలం ప్రాజెక్టు రాయలసీమలోనే ఉందనే విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వాలు హైకోర్టు, రాజధాని రెండూ అమరావతిలోనే ఏర్పాటు చేసి రాయలసీమకు అన్యాయం చేశాయన్నారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తికి తీవ్ర గాయాలు
కమలాపురం : కమలాపురం–ఖాజీపేట ప్రధాన రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కామనూరు శ్రీరాములు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని గంగవరం సమీపంలోని కుందూ నది వద్ద ఉన్న కాశీనాయన దేవాలయం సమీపంలో అరుగుపై కూర్చుని ఉన్న శ్రీరాములును సిమెంట్ ట్యాంకర్ ఢీకొంది. ఈ ఘటనలో శ్రీరాములు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 వాహనం ద్వారా క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో స్థానికులు అతడిని చితకబాదారు.
మద్యం దుకాణంలో చోరీ
ఖాజీపేట : మండలంలోని ఎస్‌వీబీ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. సుమారు నాలుగు కేసుల మద్యంతోపాటు క్యాష్ కౌంటర్‌లోని కొద్ది మొత్తంలో డబ్బును దొంగలు దోచుకుపోయారు. ఖాజీపేట బ్రిడ్జి అవతల ఉన్న మద్యం దుకాణంకు చెందిన యజమానులు శుక్రవారం ఉదయం దుకాణం తెరిచి చూడగా వెనుక భాగంలోని తలుపు తెరిచి ఉండటం గమనించారు. వెంటనే దుకాణంలోనీ సీసీ కెమెరాలను పరిశీలించారు. గురువారం అర్ధరాత్రి ముఖానికి మాస్కు ధరించిన దొంగ తలుపు పగులకొట్టి లోనకు ప్రవేశించాడు. దుకాణంలోని నాలుగు కేసుల మద్యంతోపాటు క్యాష్ కౌంటర్‌లోని కొద్ది మొత్తంలో డబ్బు చోరీ చేసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాలో ఉన్న దృశ్యలను పరిశీలించిన తరువాత ఖాజీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కర్నూలులోనే కృష్ణా నది బోర్డు ఉండాలి