ఆస్తి వివాదాల నేపథ్యంలో దాడి | - | Sakshi
Sakshi News home page

ఆస్తి వివాదాల నేపథ్యంలో దాడి

Sep 6 2025 5:41 AM | Updated on Sep 6 2025 5:41 AM

ఆస్తి వివాదాల నేపథ్యంలో దాడి

ఆస్తి వివాదాల నేపథ్యంలో దాడి

అడ్డుతగిలాడనే అక్కసుతో రమేష్‌ నాయక్‌పై సజీవదహన యత్నం

ఆరుగురు నిందితులు అరెస్ట్‌, కారు స్వాధీనం

మదనపల్లె రూరల్‌ : అన్నదమ్ముల ఆస్తివివాదాల నేపథ్యంలోనే బీకే.పల్లె వైఎస్సార్‌ కాలనీలోని షేక్‌ సలీంబాషా ఇంటిపైకి రాయచోటికి చెందిన వ్యక్తులు దాడిచేశారని డీఎస్పీ మహేంద్ర తెలిపారు. దాడి చేసే క్రమంలో సలీంబాషా ఇంటి కింది భాగంలో దుకాణం నిర్వహిస్తున్న రమేష్‌నాయక్‌ అడ్డుపడటంతో ఆగ్రహించి, పెట్రోల్‌ పోసి సజీవ దహనానికి యత్నించారన్నారు. సజీవ దహనానికి ప్రయత్నించిన కేసులో రాయచోటికి చెందిన ఆరుగురు నిందితులను శుక్రవారం పట్టణంలోని రామారావుకాలనీ ఆటోస్టాండ్‌ వద్ద అరెస్ట్‌ చేసి, నేరం చేసేందుకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నామన్నారు. డీఎస్పీ మహేంద్ర కేసుకు సంబంధించి తెలిపిన వివరాలిలా.. పట్టణ శివారుప్రాంతం బీకే.పల్లె వైఎస్సార్‌ కాలనీలోని షేక్‌ సలీంబాషా తండ్రి షేక్‌ మహబూబ్‌బాషా, రాయచోటికి చెందిన ఖాసింసాబ్‌ అన్నదమ్ములు. వీరి రెండు కుటుంబాల మధ్య ఆస్తి విషయంగా మనస్పర్థలు ఉన్నాయి. ఏడాది క్రితం షేక్‌ మహబూబ్‌బాషా రాయచోటిలో చనిపోయాడు. ఈ విషయంగా షేక్‌ మహబూబ్‌బాషా కుటుంబ సభ్యులకు అతడి మరణంపై అనుమానాలు ఉన్నాయి. ఆయన మరణాంతరం ఆస్తుల పంపకాలకు సంబంధించి వివాదాలు ఏర్పడ్డాయి. దీంతో ఇరుకుటుంబాల మధ్య మనస్పర్థలు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఈనెల 3వ తేదీ తెల్లవారుజామున రాయచోటికి చెందిన ఖాసింసాబ్‌ కుమారులు షేక్‌జావేద్‌ హుస్సేన్‌(25), షేక్‌ షామీర్‌ హుస్సేన్‌(29)లు తమకు పరిచయస్థులైన షేక్‌ ఇలాహి అలియాస్‌ ఫాజిల్‌(32), కలికిరి మండలం దూదేకులపల్లెకు చెందిన వేంపల్లె మస్తాన్‌(38), కే.వి.పల్లె మండలం తిమ్మాపురం కొత్త ఇండ్లుకు చెందిన షేక్‌ అమీర్‌సాహెబ్‌(28), కలికిరి మండలం గుండ్లూరుకు చెందిన కారు డ్రైవర్‌ కొమ్మిరిశెట్టి విశ్వనాథ్‌బాబుతో కలిసి మదనపల్లెలోని వైఎస్సార్‌ కాలనీకి చేరుకున్నారు. పథకం ప్రకారం మార్గమధ్యంలో ఓ పెట్రోల్‌బంకు వద్ద కారుకు డీజిల్‌ పట్టించి, బాటిల్స్‌లో పెట్రోల్‌ నింపుకున్నారు. సలీంబాషా ఇంటిపై కర్రలు, రాళ్లు, రాడ్స్‌తో దాడి చేస్తూ వీరంగం సృష్టించారు. గేటును రాడ్‌లతో పగలగొడుతూ, ఇంటిపై రాళ్లు రువ్వుతూ, సలీంబాషాపై దాడిచేసేందుకు యత్నించారు. సలీంబాషా ఇంట్లో అద్దెకు ఉంటున్న రమేష్‌నాయక్‌ శబ్దాలు విని గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన జావీద్‌హుస్సేన్‌, షామీర్‌హుస్సేన్‌లు తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ అతడిపై పోసి నిప్పంటించారు. ఈ విషయం గమనించిన సలీంబాషా, టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే స్పందించి ఘటనాస్థలానికి వెళ్లారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. కుటుంబసభ్యులు, బాధితుడ్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లగా, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే ఉందన్నారు. నిందితులపై దాడి, హత్యాయత్నం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కేసు విచారణలో ప్రతిభచూపిన సీఐ రాజారెడ్డి, ఎస్‌ఐ రహీముల్లా, సిబ్బందిని అభినందించారు.

నిందితులు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అనుచరులు

రాయచోటి నుంచి వచ్చి మదనపల్లెలో రౌడీయిజాన్ని ప్రదర్శించి, ఎస్టీ కులానికి చెందిన రమేష్‌నాయక్‌పై సజీవదహనానికి యత్నించిన కేసులో నిందితులు జిల్లాకు చెందిన మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అనుచరులుగా తెలుస్తోంది. నెలరోజుల క్రితం ఇదే వ్యక్తులు మదనపల్లెలో మంత్రి పేరు చెప్పి ఓ భూదందా సెటిల్మెంట్‌ చేసినట్లు సమాచారం. మంత్రి అండ ఉంది కనుకే.. రాయచోటి రౌడీమూకలు బరితెగించి మదనపల్లెలో దౌర్జన్యానికి పాల్పడ్డారని పలువురు మాట్లాడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement