
పెన్నానదిలో వృద్ధ దంపతులు ఆత్మహత్య
● విస్తృతంగా జాలర్లు గాలింపు
● మాచుపల్లి సమీపాన మృతదేహాలు లభ్యం
సిద్దవటం : పెన్నా నదిలో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంపై పలువురు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. చెన్నూరు గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య (84), నాంచారమ్మ (80) దంపతులు బుధవారం తమ ఒంటిపై ఉన్న నగలు, నగదు ఇంటిదగ్గర పెట్టి కనబడకుండా పోవడంతో వారి పెద్ద కుమారుడు మహేష్ చెన్నూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం సాయంత్రం సిద్దవటం మండలంలోని మాచుపల్లి గ్రామంలో వెలసిన శ్రీ రేణుకా ఎల్లమాంబ అమ్మవారిని దర్శించుకొని కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకొని పెన్నా నదిలో మొదట నాంచారమ్మ దూకగా కేసుపు అటూ ఇటూ ఇతరుగుతూ తడబడి వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి కూడా పెన్నాదిలో దిగాడు. ఆలయంలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదు కాగా ఒడ్డున నాంచారమ్మ పాదరక్షలు ఉండటంతో బంధువులు గుర్తించారు. మృతి చెందిన వృద్ధ దంపతుల చిన్న కుమారుడు రాంబాబు ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు ఐదుగురు జాలర్ల సహాయంతో పెన్నా నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. మాచుపల్లి గ్రామ సమీప ప్రాంతాలలోని ముళ్లపొదల్లో మృతదేహాలు ఉన్నట్లు జాలర్లు గుర్తించి పెన్నా నదిఒడ్డున చేర్చారు. మృతి చెందిన వృద్ధులుగతకొన్ని రోజులుగా దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతూ అవస్థలు పడేవారు. పలుమార్లు వైద్యశాలలో చికిత్స కూడా చేయించామని వారి బంధువులు తెలిపారు. ఎస్‌ఐ మహమ్మద్ రపీ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి శుక్రవారం మాచుపల్లి పెన్నా నది ఒడ్డున రిమ్స్ వైద్యుడు శవ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
మృతులు వెంకటసుబ్బయ్య, నాంచారమ్మ (ఫైల్), పెన్నానది నుంచి మృతదేహాలను బయటకు తెస్తున్న దృశ్యం

పెన్నానదిలో వృద్ధ దంపతులు ఆత్మహత్య