నకిలీ విత్తనాలతో నిండా ముంచారు | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలతో నిండా ముంచారు

Sep 3 2025 4:35 AM | Updated on Sep 3 2025 4:35 AM

నకిలీ విత్తనాలతో నిండా ముంచారు

నకిలీ విత్తనాలతో నిండా ముంచారు

తాడిపత్రి రూరల్‌ : నకిలీ విత్తనాలు అంటగట్టి నిండా ముంచారని రైతులు వాపోయారు. పట్టణంలో వైఎస్సార్‌ సర్కిల్‌లోని మధుసాయి ట్రేడర్స్‌ వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. బాధిత రైతులు తెలిపిన మేరకు.. వైఎస్సార్‌ కడప జిల్లా ముద్దనూరు మండలం శెట్టివారిపల్లికి కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి వెళ్లాడు. తాను తాడిపత్రిలోని మధుసాయి ట్రేడర్స్‌కు చెందిన ఉద్యోగి అని అక్కడి రైతులకు చెప్పాడు. తమ వద్ద సోహా 007 రకం మొక్కజొన్న విత్తనాలు ఉన్నాయని చెప్పాడు. కేవలం 110 రోజుల్లోనే పంట దిగుబడి వస్తుందని ఆశ చూపాడు. దాదాపు 30 మంది రైతులకు ఆ విత్తనాలు కట్టబెట్టాడు. అతని మాటలు నమ్మిన రైతులు విత్తనాలను కొనుగోలు చేసి ఎకరాకు రూ.40 వేల నుంచి 45 వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేశారు. అయితే, 90 రోజులు కావస్తున్నా పంట సరిగా రాకపోవడం.. మొక్కజొన్న కంకులు కూడా నాసిరకంగా ఉండడంతో తాము మోసపోయిన విషయాన్ని గుర్తించిన రైతులు ఇటీవల తాడిపత్రికి వచ్చి సాయిమధు ట్రేడర్స్‌ యజమానికి పరిస్థితిని వివరించారు. విషయాన్ని విత్తన కంపెనీ దృష్టికి తీసుకెళతానని చెప్పిన ఆయన మళ్లీ పట్టించుకోలేదు. దీంతో బాధిత రైతులు సోమవారం తాడిపత్రికి వచ్చి దుకాణం వద్ద నాసిరకంగా ఉన్న కంకులతో ఆందోళన చేశారు. తమ గ్రామానికి వచ్చిన వ్యక్తి షాపులో ఉండడం గుర్తించి అతడిని నిలదీశారు. తాను కంపెనీ ప్రతినిధిని కాదని, షాపులో పనిచేస్తున్న గుమస్తా అని చెప్పడంతో రైతులు మరింత మండిపడ్డారు. తమకు న్యాయం చేసేంతవరకు వెళ్లేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న ఏడీఏ రవి.. పెద్దపప్పూరు ఏఓ మహితా కిరణ్‌ను దుకాణం వద్దకు పంపించారు. షాపులోని మొక్కజొన్న విత్తనాల ప్యాకెట్లను పరిశీలించారు. విచారణ తరువాత కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేస్తామని ఏడీఏ రవి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement