
అన్నమయ్య జిల్లా: ఉద్యోగిగా కొడుకు తప్పు చేసినా తండ్రి తలవంచలేదు. పైగా విలువను చాటుకున్నాడు. బిడ్డ చేసిన తప్పిదాన్ని పేద వాడైనప్పటికీ తండ్రి పెద్ద మనసుతో సరిచేసి శభాష్ అనిపించుకున్నాడు. మనసును కదిలించే ఈ సంఘటనకు సంబంధించి వివరాలలోకి వెళితే.. కురబలకోట మండలం అంగళ్లు గ్రామం జోగివారిపల్లెకు చెందిన జె. వెంకటరమణ కుమారుడు జె. వెంకటేష్ అదే మండలంలోని తెట్టు గ్రామ సచివాలయంలో జూనియర్ లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి కేటాయించిన రూ.4.69,500ల నగదుతో వెంకటేష్ సోమవారం పరారైన విషయం తెలిసిందే.
ఇతని కోసం తెలిసిన చోటల్లా వెతికినా ఆచూకీ లభించలేదు. ఇది అతని తండ్రి వెంకటరమణను తీవ్రంగా కలచివేసింది. ఆయన మనసు విరిగిపోయింది. పింఛన్ల సొమ్ముతో ఉడాయించడం పట్ల ఎంతగానో చింతించాడు. కొడుకు చేసిన తప్పిదానికి తనే బాధ్యత వహించాడు. వెంటనే అతను తెలిసిన వారి వద్ద అప్పుచేసి కొడుకు ఎత్తుకెళ్లిన పింఛన్ సొమ్మును ఎంపీడీఓ గంగయ్యకు అందజేశారు. మంగళవారం పింఛన్‌దారులకు ఈ సొమ్మును కూడా పంపిణీ చేసినట్లు ఎంపీడీఓ తెలిపారు.
కొడుకు తప్పు చేసినా తండ్రి తన విలువను చాటుకున్నాడు. బిడ్డ భవిష్యత్తుకు మార్గం ఏర్పడుతుందన్న ఆశతో తండ్రి బాధ్యత వహించి నగదు చెల్లించడాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. పిల్లలు తప్పు చేస్తే చేతులు దులుపుకోవడం సాధారణమైన ఈ రోజుల్లో తండ్రి తనానికి కొత్త అర్థం చెప్పారు. అంతేగాకుండా విలువలకు ప్రతిరూపంగా నిలిచిన వెంకటరమణ నిర్ణయం అధికార యంత్రాంగాన్ని కూడా కదిలించింది.