
మరణించినా నేత్రాలు వృథా కారాదు
జిల్లా అంధత్వ నివారణాధికారి డాక్టర్ మాధవి
ప్రొద్దుటూరు క్రైం : మరణించినా వారి నేత్రాలు వృథా కారాదని జిల్లా అంధత్వ నివారణాధికారి డాక్టర్ మాధవి తెలిపారు. 40వ నేత్రదాన పకోత్సవాల సందర్భంగా పట్టణంలోని శ్రీనివాసనగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం వద్ద ఆప్తాల్మిక్ అధికారి కేజే రఘరామిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నేత్రదాన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ వయస్సు భేదం లేకుండా ఎవరైనా నేత్రదానం చేయొచ్చన్నారు. దెబ్బలు తగిలినప్పుడు, ఆపరేషన్ తర్వాత కొన్ని ఇన్ఫెక్షన్‌ల వల్ల, అంటు వ్యాధుల ద్వారా నల్లగుడ్డు దెబ్బతిని చూపు కోల్పోయే పరిస్థితి వస్తుందని తెలిపారు. అలాగే ఎయిడ్స్ వ్యాధి ఉన్నవారు, కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధితో బాధపడేవారు,హెపటైటిస్ బీ, సీ ఉన్నవారు నేత్రదానం చేయరాదన్నారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత 4 నుంచి 6 గంటల లోపల వారి నేత్రాలను సేకరించాలని చెప్పారు. డిప్యూటీ డీహెంహెచ్‌ఓ డాక్టర్ గీత మాట్లాడుతూ మనం మరణించిన తర్వాత మన కళ్లు వృథా కాకుండా నేత్రదానం చేస్తే ఇరువురు అంధులకు చూపును ప్రసాదించినవారం అవుతామని తెలిపారు. అనంతరం అర్బన్ హెల్త్ సెంటర్ నుంచి రాజీవ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు మోహన్‌కాంత్, మధుకుమార్, రవికుమార్, డిప్యూటీ హెల్త్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, శోభ, ఆప్తాల్మిక్ ఆఫీసర్ తేజ, సీఓలు ఎంవీ సుబ్బారెడ్డి, నాగజ్యోతి, సూపర్‌వైజర్‌లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్ పాల్గొన్నారు.