
రైలు కింద పడి బాలుడి ఆత్మహత్యాయత్నం
కమలాపురం : కమలాపురం పట్టణం రెడ్డీస్ కాలనీకి చెందిన శ్రీహరి రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. రెడ్డీస్ కాలనీకి చెందిన నరసింహరావు కుమారుడు శ్రీహరి 9వ తరగతి చదువుతున్నాడు. శనివారం వినాయక నిమజ్జనానికి వెళ్లి ఎంత సేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలుడు చెరువు కట్ట వద్ద గుర్తు తెలియని రైలు కింద పడ్డాడు. ఈ ఘటనలో చేయి తెగిపోవడంతో పాటు తలకు బలమైన గాయమై తీవ్ర రక్త స్రావం అయింది. రైల్వే సిబ్బంది సమాచారం మేరకు విషయం తెలుసుకున్న కడప రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.