
ఇది మహిళా వ్యతిరేక ప్రభుత్వం
కడప కార్పొరేషన్: రాష్ట్రంలో మహిళా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ధ్వజమెత్తారు. ఆదివారం ఇక్కడి జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత ఎన్నికల్లో మహిళలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 మాసాలు గడిచినా ఏ పథకాన్ని సరిగ్గా అమలు చేయలేదన్నారు. 19–59 ఏళ్లలోపు మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తామని దాని ఊసే ఎత్తడం లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని 11 రకాల సర్వీసుల్లో ఐదింటిలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నారన్నారు. 20లక్షల ఉద్యోగాలిస్తామని, నిరుద్యోగులకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చేసిన మొదటి సంతకానికి దిక్కు లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు ఇస్తామని, మొదటి ఏడాది ఎగ్గొట్టారని, రెండో ఏడాది రూ.7వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు. ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని, ఉన్న పింఛన్లు తీసేశారన్నారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, మొదటి ఏడాది ఒక సిలిండర్ మాత్రమే ఇచ్చారన్నారు. అమ్మ ఒడి పథకాన్ని కాపీ కొట్టి అమలు చేసిన తల్లికి వందనం పథకం కూడా మొదటి ఏడాది ఇవ్వలేదన్నారు. ఇలా అన్ని పథకాలకు తూట్లు పొడుస్తూ సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని ఏ మొఖం పెట్టుకొని చెప్పుకుంటారని ప్రశ్నించారు. మహిళల రక్షణ, భద్రత పూర్తిగా గాలికొదిలేశారన్నారు. మహిళలపై చేయి వేస్తే అదే చివరి రోజవుతుందని ఎన్నికల్లో చెప్పారని, టీడీపీ ఎమ్మెల్యేలే మహిళలను వేధిస్తున్నా చివరి రోజు చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సుమారు 80వేల బెల్టుషాపులు ఏర్పాటు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారన్నారు. మంత్రివర్గంలో ముగ్గరు మహిళలున్నా మహిళలపై జరిగే అఘాయిత్యాలపై వారు స్పందించిన పాపాన పోలేదన్నారు. మహిళల జోలికొస్తే తాటతీస్తా, తొక్కతీస్తా అంటూ ఊగిపోయిన పవన్‌కళ్యాణ్ ఇప్పుడు శాంతిభద్రతలు తన పరిధిలోకి రావంటున్నారన్నారు. సుగాలి ప్రీతి కేసును రాజకీయంగా ఉపయోగించుకొని లబ్ధిపొంది, ఆ బాలిక తల్లికి ఇప్పుడు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి సతీమణి అరుణమ్మ మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవడానికి మహిళలంతా కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ మనోహరి, జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండి దీప్తి, మహిళా నేతలు బి. మరియలు, ఏకుల రాజేశ్వరి, మూలే సరస్వతి, తులశమ్మ, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం
అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ధ్వజం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో బలోపేతం చేయడానికి మహిళలంతా కృషి చేయాలని పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లాలోని మహిళా నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాకంఠక పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వానికి మహిళలంతా ఏకమై బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీలను, మహిళల రక్షణ కోసం కార్యాచరణ ప్రణాళిక రచించడానికి ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ మోసాలను ప్రజల్లోకి తీసుకుపోయి చైతన్యం చేయాలని, తద్వారా 2029లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మళ్లీ సీఎం చేసుకునేందుకు ప్రతి మహిళ కృషి చేయాలని పిలుపునిచ్చారు.