
ఆశా వర్కర్లకు కనీస వేతనాలు చెల్లించాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనాలు అమలు చేయాలని అఖిల భారత ఆశా వర్కర్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి కె.మల్లిక కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా కడపలో భారీ ప్రదర్శన, సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ విశేషమైన సేవలు అందిస్తున్న ఆశా కార్యకర్తలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవలు అందించిన ఆశా కార్యకర్తలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ లీడర్స్ అని బిరుదు ఇచ్చిందే తప్ప వారికి వేతనాలు పెంచాలని ప్రభుత్వాలు ఆలోచించకపోవడం శోచనీయమన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.రవీంద్రనాథ్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తక్షణం ఆశాల వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి ఓట్లు దండుకున్న తర్వాత ఆశాలను మర్చిపోవడం సరి కాదన్నారు. డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్.వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఆశాలకు ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్.నాగసుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు, ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాహుల్. శాంతి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్, ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు గంగాధర్, జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరి కె.సి. బాదుల్లా, ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. కల్పన తదితరులు పాల్గొన్నారు.
ఆశా వర్కర్స్ యూనియన్
జాతీయ కార్యదర్శి కె.మల్లిక