
స్మార్ట్ రేషన్‌కార్డుల పంపిణీకి సన్నాహాలు
కడప సెవెన్‌రోడ్స్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వస్తున్న స్మార్ట్ రేషన్‌కార్డులు జిల్లాలో పంపిణీ చేసేందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నామని జిల్లా పౌరసరఫరాల అధికారి రఘురాం తెలిపారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని జిల్లాల్లో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. నాల్గవ విడతలో వైఎస్సార్ కడప జిల్లాలో సెప్టెంబరు 15 నుంచి కార్డులు పంపిణీ చేస్తామన్నారు. స్మార్ట్ కార్డులన్నీ ఆయా తహసీల్దార్ కార్యాలయాలకు వస్తాయని తెలిపారు. తొలి ఐదు రోజులు స్పెషల్ కేటగిరీకి చెందిన వికలాంగులు, వయో వృద్ధుల ఇళ్లకు సచివాలయ సిబ్బంది వెళ్లి కార్డులను అందజేస్తారని తెలిపారు. ఆ తర్వాత పది రోజులపాటు ఆయా ఎఫ్‌పీ షాపు డీలర్ల సమక్షంలో కార్డుల పంపిణీ ఉంటుందన్నారు. ఆ తర్వాత ఐదు రోజులపాటు డోర్ లాక్, తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి, వివిధ కారణాలతో కార్డులు పొందలేని వారికి పంపిణీ చేస్తామన్నారు. జిల్లాలోని 1239 రేషన్ షాపుల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇందుకోసం ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. డీలర్ల వద్ద ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ (ఈ పాస్‌యంత్రం) డివైజ్‌లో స్మార్ట్ కార్డుకు అవసరమైన కొత్త రీడర్‌ను పొందుపరుస్తామన్నారు. కొత్త స్మార్ట్ రేషన్‌కార్డుల ద్వారా ఎఫ్‌పీ షాపుల్లో అక్టోబరు నుంచి సరుకులు పొందడానికి వీలు ఉంటుందని ఆయన వివరించారు.