
మాదకద్రవ్యాల నిరోధానికి పటిష్ట చర్యలు
కడప సెవెన్‌రోడ్స్ : మత్తుపదార్థాల వినియోగం, విక్రయాలు, రవాణాను అరికట్టడానికి జిల్లాలో పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీసీ హాలులో జిల్లాలో మత్తు పదార్థాల నివారణ, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధంపై జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి యాక్షన్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల మూల సరఫరా రవాణాను అరికట్టేందుకు జిల్లాలో పటిష్టమైన నిఘా చర్యలు అవలంబించాలని తెలిపారు. విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, వర్కర్లను లక్ష్యంగా చేసుకుని సరఫరా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని.. మాదకద్రవ్యాలు విక్రయాలు జరిగే చోట గట్టి నిఘా ఉంచాలన్నారు. మాదకద్రవ్యాల బారిన పడిన బాధితుల పట్ల సున్నితంగా వ్యవహరించాలని పోలీస్ శాఖకు సూచించారు. బాధితులకు కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు పునరావాసం కల్పించాలని అన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో ఈగల్స్ టీమ్స్ ద్వారా మాదకద్రవ్యాల నిరోధకం, వాడకం పై ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టడం జరుగుతోందన్నారు. అక్రమ డ్రగ్స్ వాడకం, రవాణాపై సమాచారాన్ని తెలిపేందుకు.. పోలీసు శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ : 1972 లకు కాల్ చేయవచ్చన్నారు. రిమ్స్ ప్రాంగణంలోని డి.అడ్డిక్షన్ సెంటర్ ను ఎల్లవేళలా అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్టళ్లనందు డ్రగ్స్ వినియోగం జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కడప.మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, కష్టమ్స్ శాఖ, పోలీసు, ఎస్సైజ్, రెవెన్యూ, విద్య, వైద్య, వ్యవసాయ, రవాణా, సంక్షేమ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి