
ట్రిపుల్ ఐటీ.. కులాల కుంపటి !
సాక్షి ప్రతినిధి, కడప : అధ్యాపకులు విలువలను గాలికొదిలేస్తున్నారు. చదువు..సంస్కారాన్ని మరిచి కులాల కుంపట్లలో మునిగి తేలుతున్నారు. రేపటి సమాజాన్ని నిర్మించాల్సిన స్థానంలో ఉండి ‘గురు’తర బాధ్యతలను విస్మరిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ అధ్యాపకుల మధ్య కులాల రగడ మొదలైంది. ఉన్నతస్థాయిలో ఉంటూనే వ్యక్తిత్వలోపంతో కులాల పరంగా దూషణలకు దిగుతున్నారు. అణగారిన వర్గాలకు చెందిన అధ్యాపకులపై వివక్ష చూపిస్తున్న ఘటన తాజాగా తెరపైకి వచ్చింది.
ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ తెలుగుశాఖకు చెందిన ఓ మెంటార్‌ను అదే శాఖకు చెందిన భార్యాభర్తలైన అధ్యాపకులు కులంపేరుతో దూషణలకు దిగా రు. వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. విద్యాసంస్థపై దిగజారుడు మాటలు మాట్లాడారు. ఇలాంటి ఘటనలు ముందెన్నడూ ఉత్పన్నం కాలేదు. గడిచిన ఏడాదిగా ట్రిపుల్ ఐటీ క్యాంటీన్ల కోసం అటు టీడీపీ వర్గీయుల దౌర్జన్యం, ఇటు ఆదే సామాజికవర్గానికి చెందిన అధ్యాపకుల అనుచిత వ్యాఖ్యలు తరచూ తెరపైకి వస్తున్నాయి. ఈ పరిస్థితులల్లో తెలుగుశాఖ మెంటార్ డైరెక్టర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. భార్యాభర్తలైన అధ్యాపకులిద్దరు వ్యవహరించిన, దూషించిన, అవమానపర్చిన ధోరణిని అందులో వివరించారు. ఆపై డైరెక్టర్ కుమారస్వామి గుప్తా కంప్యూటర్ సైన్సు ప్రొఫెసర్ రత్నకుమారి చైర్మన్‌గా ఒక కమిటీ ఏర్పాటు చేశారు. విచారించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ క్రమంలో తెలుగుమెంటార్‌పై అనుచిత వ్యాఖ్యానాలు, దూషణలు నిజమేనని మరో ఇద్దరు మెంటార్లు చెప్పుకొచ్చారు. దాంతో దంపతులిద్దరికీ అసహనానికి లోనయ్యారు. తనపై ఏకంగా అత్యాచారానికి యత్నించారని అధ్యాపకురాలు డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇవన్నీ విచారణ కమిటీ ముందుకు వచ్చాయి. కమిటీ చైర్మన్, సభ్యులు విచారణ పూర్తి చేసి నివేదికను డైరెక్టర్‌కు సమర్పించారు.
చర్యలకు వెనుకంజ...
ఉన్నత స్థాయి విద్యా సంస్థలో కులాలు కుంపట్లు తెరపైకి తేవడాన్ని డైరెక్టర్ తీవ్రంగా పరిగణించాల్సి ఉంది. కాగా కమిటీ రిపోర్టును సైతం తొక్కిపెట్టినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. అధ్యాపకులైన దంపతులకు అండగా ‘కమ్మ’గా హైలెవెల్ ఒత్తిడులు వచ్చినట్లు సమాచారం. వివాదాస్పదులైన అధ్యాపకుల దంపతులు పనితనంలోని అశ్రద్ధ, నిర్లక్ష్యం, బెదిరింపు ధోరణులు ఇలా అనేకం తెరపైకి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కంటితుడుపు చర్యలకు మాత్రమే పరిమితమైనట్లు పలువురు వాపోతున్నారు. కాగా, ఈ విషయమై ఆర్కేవ్యాలీ ట్రీపుల్‌ఐటీ డైరెక్టర్ కుమారస్వామిగుప్తా వివరణ కోరగా అదంతా ఇంటర్ననల్ వ్యవహారం, పైగా ఇష్యూ సమసిపోయిందని చెప్పుకొచ్చారు. అసలు విషయం వెల్లడించేందుకు నిరాకరించడం గమనార్హం.
అణగారిన వర్గాలకు చెందిన
అధ్యాపకులపై వివక్ష
కుల అహంకారంతో రెచ్చిపోయి
అనుచిత వ్యాఖ్యలు
భరించలేక డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తెలుగుశాఖ మెంటార్
విచారణకు ఆదేశించిన డైరెక్టర్...
ఆపై ‘కమ్మ’ని ఒత్తిళ్లు