
బాలికల ఫుట్‌బాల్ విజేత కడప జట్టు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కడప నగర శివారులోని డాక్టర్ వైఎస్‌ఆర్ క్రీడా పాఠశాలలో నిర్వహించిన ఇంటర్–పెన్నా జోన్ జూనియర్ బాలికల ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో కడప జిల్లా జట్టు విజేతగా నిలిచింది. చివరి రోజైన శనివారం ఎంతో ఉత్సాహంతో పోటీలు జరిగాయి. ఈ టోర్నమెంట్‌లో కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల జట్లు పాల్గొన్నాయి. హోస్ట్ జట్టు అయిన కడప జిల్లా, రెండు మ్యాచ్‌ల్లోనూ విజయవంతంగా పోటీపడి జోనల్ చాంపియన్‌గా అవతరించింది. మొదటి మ్యాచ్‌లో శ్రీ సత్య సాయి జిల్లాను 6–0 గోల్స్ తేడాతో ఓడించగా, తర్వాత అన్నమయ్య జిల్లాను 5–0 గోల్స్ తేడాతో ఓడించి తమ ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించింది. ఈ విజయాలతో కడప జట్టు నెల్లూరు జిల్లాలో త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఇంటర్–జోనల్ మీట్‌కి అర్హత సాధించింది. ఈ జట్టులో ఎంపికై న ఆటగాళ్లు ఆగస్టు 20వ తేదీ నుంచి 30 వరకు బీహార్‌లో జరగబోయే అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య నిర్వహించే జాతీయ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి కార్తిక్ డెంటల్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ కార్తిక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ వయస్సులో ఆరోగ్య పరిరక్షణ ఎంత ముఖ్యమో వివరిస్తూ, క్రమం తప్పకుండా క్రీడలలో పాల్గొనడం ద్వారా స్ట్రెస్, డిప్రెషన్ లాంటి సమస్యలపై పోరాడవచ్చని పేర్కొన్నారు. క్రీడల పట్ల బాలికల్లో కనిపించిన నిబద్ధత, నైపుణ్యం, పట్టుదలకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సుధీర్, కార్యక్రమ నిర్వాహకుడు అనిల్, వైఎస్‌ఆర్ స్పోర్ట్స్ స్కూల్ కోచ్ ఎం.హరి, అన్నమయ్య జిల్లా కార్యదర్శి మురళీధర్, సత్యసాయి జిల్లా కార్యదర్శి సలీమ్ పాల్గొన్నారు.