
ఉక్కు పరిశ్రమపై టీడీపీ వైఖరిని తెలియజే యాలి
కడప ఎడ్యుకేషన్ : విభజన చట్ట ప్రకారం కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై మహానాడులో కూటమి నాయకులు స్పష్టమైన హామీ ఇవ్వాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి, ఎమ్మెల్సీ ఆలపాటిరాజా, కడప పార్లమెంటు అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిలను శుక్రవారం ఆయన కలిసి వినతిపత్రం అందజేశారు. నారాయణరెడ్డి మాట్లాడుతూ బెంగళూరు–కడప రైల్వే పనులు అమరావతి వరకూ పొడిగించాలని కోరారు. ఉక్కు పరిశ్రమపై రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. రాష్ట్ర ప్రయోజనాలకోసం ప్రజా ప్రతినిధులు నోరు మెదపకపోవడం దారుణమన్నారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటయితే ఉపాధి అవకాశాలు లభిస్తాయని యువకులు ఆశగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సగిలి గుర్రప్ప, శ్రీనివాసులు, జయవర్ధన్, కృష్ణ, డబ్ల్యూ రాము, రసూల్,గోపి, నాగేంద్ర, జగదీశ్, నాగరాజు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక
రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి