చౌటుప్పల్ : ఎల్‌నినో ప్రభావం వల్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడినందున గ్రామాల్లో నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈఓ శోభారాణి సూచించారు. వీబీజీ రామ్‌జీ జలసిరి ద్వారా చేపడుతున్న పనులు, గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలపై చౌటుప్పల్ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కార్యాచరణ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇంకుడు గుంతలు, ఊట కుంటలు, ఫామ్‌పాండ్‌ల ద్వారా గ్రామాల్లోని బోర్లను రీచార్జ్ చేయాలని సూచించారు. మండల ప్రత్యేకాధికారి రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తహసీల్దార్ వీరాబాయి, ఎంపీడీఓ కే.శ్రీలత, మండల వ్యవసాయాధికారి ముత్యాల నాగరాజు, ఏపీఓ ఈశ్వరయ్య, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవాలి
సంస్థాన్‌నారాయణపురం : ప్రతి ఇంట్లో ఒక ఇంకుడు గుంతను నిర్మించాలని జెడ్పీ సీఈఓ ఎన్.శోభారాణి సూచించారు. మంగళవారం సంస్థాన్‌నారాయణపురం ఎంపీడీఓ కార్యాలయంలో ఎల్‌నినో, జలసిరి వర్షాభావ పరిస్థితులపై మండల ప్రత్యేక అధికారి ప్రీమిల అధ్యక్షతన సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. అనంతరం కొత్తగూడెం గ్రామంలో ఓ రైతు భూమిలో ఫాంపాండ్ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సాత్విక్, ఎంపీడీఓ ప్రమోద్‌కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఫ జెడ్పీ సీఈఓ శోభారాణి


