బొమ్మలరామారం : అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి మండల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని డీఆర్‌డీఓ నాగిరెడ్డి అన్నారు. మండల నోడల్ అధికారి భిక్షపతితో కలిసి బొమ్మలరామారం మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసి వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, నీటి వనరుల స్థిర వినియోగానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ అమలు, మ్యాజిక్ సోక్ పిట్లు, కమ్యూనిటీ సోక్ పిట్లు, ఫామ్ పాండ్‌లు, బోర్వెల్ రీచార్జ్ స్ట్రక్చర్‌లు, ఓపెన్ వెల్ రీచార్జ్ పనులు, మహిళా భవనాల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. వన మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించి నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలన్నారు. వరి సాగు బదులుగా ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల వైపు మళ్లాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ శ్యామల, పీఏసీఎస్ చైర్మన్ మల్లేష్, ఎంపీఓ శ్రీమాలిని, సెర్ప్ ఏపీఎం చెంచెల యాదగిరి, ఏఓ దుర్గేశ్వరి, ఎంఈఓ రోజారాణి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
ఫ డీఆర్‌డీఓ నాగిరెడ్డి


