బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం
సాక్షి, యాదాద్రి : బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పేర్కొన్నారు. అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణతో కలిసి భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఫంక్షన్ హాల్స్ యజమానులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయ న మాట్లాడారు. వసతి గృహాల విద్యార్థులను శుభకార్యాల్లో క్యాటరింగ్ పనులకు ఉపయోగిస్తే సంబంధిత ఫంక్షన్ హాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్లను ఎలాంటి పనుల్లోనూ నియమించకూడదని స్పష్టం చేశారు. నీటి వృథాను అరికట్టి, భూగర్భ జలాల పెంపునకు తప్పనిసరిగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాష్ రెడ్డి, అధికారులు, యజమానులు పాల్గొన్నారు.
వరికి బదులు ఆరుతడి పంటలు మేలు
భువనగిరి: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం వల్ల రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి పీవీ రమణారెడ్డి సూచించారు. మంగళవారం భువనగిరి మండలంలోని మాసుకుంట వద్ద రైతువేదికలో విత్తనమేళా నిర్వహించారు. ప్రస్తుతం వరి సాగును తగ్గించుకొని ఆరు తడి పంటల సాగుతోనే రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. విత్తన మేళా కార్యక్రమాల ద్వారా రైతు వేదికల్లో కందులు, పెసర, జొన్న విత్తనాలు అందుబాటులో ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మల్లేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు వెంకట్రావు, అనిల్, ప్రియాంక, సంధ్య, ఉమా, కృష్ణకుమారి పాల్గొన్నారు.
తేనెటీగల పెంపకంతో యువతకు ఉపాధి
సంస్థాన్ నారాయణపురం: తేనెటీగల పెంపకంతో గ్రామీణ యువత, రైతులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. రాచకొండ అటవీ ప్రాంతంలో తేనెటీగల పెంపకం ద్వారా సేకరించిన స్వచ్ఛమైన తేనెతో రూపొందించిన రాచకొండ ఫారెస్ట్ హనీ బ్రాండ్‌ను సోమవారం మునుగోడులో ఆవిష్కరించి మాట్లాడారు. తేనెటీగల పెంపకం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న మిత్రా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నిమ్మల రామచంద్రయ్య, నోముల మాధవరెడ్డి సేవలను ఎమ్మెల్యే అభినందించారు. మునుగోడు నియోజకవర్గంలోని 161 గ్రామాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని విస్తరించేందుకు రూపీనేని కాంతి సేవలు అందించాలని కోరారు. సుధాకర్ చేపడుతున్న పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో మన్నే నర్సిరెడ్డి, ప్రముఖ్‌రెడ్డి, సామల భాస్కర్, పురుషోత్తంరావు, అంజిరెడ్డి, లతా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
మహా శివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలను జరిపించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు చేశారు. భక్తులచే అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలను అర్చకులు సంప్రదాయంగా జరిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.


