యాదగిరిగుట్ట: విద్యార్థులు, యువత జీవితాలతో ఆడుకుంటున్న ప్రధాని నరేంద్రమోదీని భవిష్యత్తులో గద్దె దింపుతామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాడికి నిరసనగా యాదగిరిగుట్ట పట్టణంలో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి చేపట్టిన కాగడాలర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీతో కలిసి యువత, విద్యార్థులు శాంతి యుతంగా నిరసన చేపడితే నరేంద్రమోదీ ప్రభుత్వం లాఠీ చార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నరేంద్రమోదీ 12 సంవత్సరాల పాలనలో 150 సార్లు పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని మండిపడ్డారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించి చేతులు దులుపుకున్నారని, పేపర్ లీకేజీపై ప్రధానిమోదీ లోతైన విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా అందించాలన్నారు. 21 సంవత్సరాలు నిండిన యువతను చట్ట సభల్లోకి పంపిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని, ఇందుకు సంబంధించిన బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ, ఏఎంసీ చైర్‌పర్సన్ ఐనాల చైతన్యరెడ్డి, యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్‌పర్సన్ గుండ్లపల్లి వాణి, వైస్ చైర్‌పర్సన్ బరిగె రమ్య, పీఏసీఎస్ చైర్మన్ చీర శ్రీశైలం, మండల, పట్టణ అధ్యక్షులు మంగ సత్యనారాయణ, ముక్కెర్ల మల్లేష్ పాల్గొన్నారు.
ఫ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య


