సాక్షి, యాదాద్రి: రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన కోట్లాది రూపాయల విలువైన ధాన్యం మాయమవుతోంది. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) అప్పగించే వరకు మిల్లులపై పక్కా నిఘా ఉంచాల్సిన యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో మిల్లర్లు యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఒక్క భువనగిరి మండలం అనంతారంలోని యాదాద్రి రైస్ మిల్లులోనే ఏకంగా రూ.24.31 కోట్లు విలువ చేసే వేలాది టన్నుల ధాన్యం స్వాహా కావడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అక్రమంగా విక్రయించిన సర్కారు వడ్ల డబ్బులతో మిల్లర్లు ఏకంగా స్థిరాస్తి వ్యాపారానికి తెరలేపినట్లు సమాచారం
రూ. 24.31 కోట్ల ధాన్యం మాయం
భువనగిరి మండలం అనంతారం యాదాద్రి రైస్ మిల్లులో అధికారుల లెక్కల ప్రకారం 6,776.251 మెట్రిక్ టన్నులు ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం నిల్వ లేదు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం ఆ ధాన్యం విలువ సుమారు రూ.24.31 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ భారీ కుంభకోణంపై కేసు నమోదు చేసిన పోలీసులు, మిల్లు యాజమాన్యానికి చెందిన ఐదుగురిలో ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేశారు. మిగతా నలుగురు పరారీలో ఉన్నారు.
ప్రభుత్వ డబ్బుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం
సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్లు ఆ డబ్బును స్థిర, చరాస్తుల కొనుగోలు, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. సుమారు రూ.24.31 కోట్ల విలువైన ధాన్యాన్ని అక్రమంగా విక్రయించి, ఆ డబ్బుతో హైదరాబాద్‌లోని ఉప్పల్ బగాయత్‌లో కోట్ల విలువైన ప్లాట్‌ను మిల్లు పేరు మీద కొనుగోలు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. ఈ మిల్లులో ఉన్న ఇద్దరు పార్ట్‌నర్‌లు గతంలో ఇతర మిల్లుల్లో కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం
సకాలంలో తీసుకోకపోవడమే అదునుగా..
ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం నిల్వలు రైస్ మిల్లుల్లో పెరిగిపోతున్నాయి. ఏ సీజన్‌లో ఇచ్చిన ధాన్యం సీఎంఆర్‌ను ఆ సీజన్‌లో తీసుకోకపోవడం, ఎఫ్‌సీఐ, పౌరసరఫరా శాఖ గోదాములలో స్థలాలు కేటాయించకపోవడం వల్ల ఎడతెగని జాప్యం కొనసాగుతోంది. ఇదే అదునుగా మిల్లర్లు బియ్యాన్ని అక్రమంగా బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. మరో సీజన్‌లో ఇచ్చే ధాన్యంతో పాత సీఎంఆర్ ఇవ్వొచ్చనే భావనతో కోట్లు విలువ చేసే ధాన్యాన్ని స్వాహా చేస్తూ సిరులు గడిస్తున్నారు.
అధికారులవి మొక్కుబడి తనిఖీలేనా?
మిల్లుల్లో ఉన్న ధాన్యాన్ని సివిల్‌సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్‌ఐల ఆధ్వర్యంలో అధికారులు ప్రతి 15 రోజులకు ఒకసారి తనిఖీ చేసి లెక్కలు తేల్చాలి. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అధికారులు మొక్కుబడిగా మిల్లుకు వెళ్లడం, కాగితాలపై లెక్కలు చూసుకుని వస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
జిల్లా వ్యాప్తంగా ఇదే తీరు!
జిల్లాలోని 41 మిల్లులకు 2023–24 యాసంగి సీజన్‌లో ఇచ్చిన ధాన్యానికి సంబంధించి సగానికి సగం మిల్లర్లు ఇంకా బియ్యం తిరిగి ఇవ్వలేదు. అధికారులు చర్యలు తీసుకోకపోగా వాయిదాల మీద వాయిదాలు ఇస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే పోచంపల్లి మండలం ముక్తాపూర్ మిల్లులో రూ.12 కోట్ల టెండర్ ధాన్యాన్ని మిల్లర్లు అమ్ముకున్నారు. గుండాల మండలం వెల్మజాల మిల్లులో రూ. 4 కోట్ల ధాన్యం అమ్ముకుంటే మిల్లు యజమానిపై ఆర్‌ఆర్ యాక్టు నమోదు చేసి ఆస్తులను ఫ్రీజ్ చేశారు. అధికారుల ఉదాసీనతనా, లేక అండదండలతోనే మిల్లర్లు రైతుల ధాన్యాన్ని యథేచ్ఛగా విక్రయిస్తున్నారన్న చర్చ ఊపందుకుంది.
యాదాద్రి మిల్లులో రూ. 24.31 కోట్ల ధాన్యం మాయం
ఫ మిల్లుపేరున ప్లాట్లు కొన్నట్లు అధికారుల విచారణలో వెల్లడి
ఫ ఐదుగురిపై కేసు.. ఒకరి అరెస్టు, నలుగురు పరారీ
ఫ అధికారుల మొక్కుబడి తనిఖీలతో మిల్లర్ల మాయాజాలం
యాదాద్రి మిల్‌కు సంబంధించిన ధాన్యం వివరాలు
యాసంగి 2024–25 2022–23
మిల్లుకు కేటాయించిన ధాన్యం 10,318.588 8,921.440
ఇవ్వాల్సిన సీఎంఆర్ 6,969.790 6,030.382
ఇచ్చిన సీఎంఆర్ 2,468.251 4,246.382
టెండర్ ధాన్యం – 2,376.421
నిల్వ ఉండాల్సిన ధాన్యం 6,688.808 247.443
నిల్వ ఉన్న ధాన్యం 160 నిల్


