నిడమనూరు : అప్పుల బాధతో గడ్డి మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన కొంపెల్లి సైదులు(50) ఇటీవల అప్పు చేసి అర ఎకరం పొలం కొనుగోలు చేశాడు. అప్పు తీర్చే మార్గం లేక ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. సాయంత్రం పొలం నుంచి అతడి భార్య వచ్చి చూసి చుట్టుపక్కల వారి సహాయంతో 108 అంబులెన్స్‌లో నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడి..
కేతేపల్లి : ఇరవై రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. కేతేపల్లి మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు ఊర యాదగిరి(53) ఈ నెల 7న కేతేపల్లిలోని ఎస్సీ కాలనీ సమీపంలో 65 నంబర్ జాతీయ రహదారి దాటుతుండగా కారు ఢీకొట్టడంతో తీవ్ర గాయపడ్డాడు. చికిత్స నిమ్తితం కుటుంబ సభ్యులు అతడిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.


